నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ప్రచారం చాలా చాలా ఉధృతంగా కొనసాగిస్తున్నారు రఘురామకృష్ణరాజు.
వాస్తవానికి, రఘురామకు కూటమి తరఫున టిక్కెట్ రాదన్న ప్రచారం తొలుత జరిగింది. వైసీపీ అనుకూల మీడియా సంబరాలూ చేసుకోవడం చూశాం. అయితే, అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు రఘురామకృష్ణరాజు.
టీడీపీ అభ్యర్థి చివరి నిమిషంలో, రఘురామకి లైన్ క్లియర్ చేయడంతో, రఘురామ అభ్యర్థిత్వం ఓ సంచలనంగా మారింది. ఆ షాక్ నుంచి వైసీపీ ఇంకా తేరుకోలేదనడం నిర్వివాదాంశం.
కేవలం ఉండి నియోజకవర్గ పరిధిలోనే రఘురామకృష్ణరాజు ఎన్నికల ప్రచారం జరుగుతున్నా, మొత్తంగా నర్సాపురం పార్లమెంటు పరిధిలో, రఘురామ అనుచరులు, కూటమి అభ్యర్థుల తరఫున చాలా చాలా ఉధృతంగా పని చేస్తుండడం గమనార్హం.
మరీ ముఖ్యంగా, జనసేనతో ఆయన అనుచరులు కలిసి పని చేస్తున్న వైనం, మరో మిత్రపక్షం టీడీపీకి ఆశ్చర్యంతోపాటు అమితానందాన్నీ కలిగిస్తోంది. టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట కూడా రఘురామ అనుచరులు, గెలుపు కోసం శ్రమిస్తున్నారు.
నర్సాపురం లోక్ సభ సీటు రఘురామకి వచ్చి వుంటే, ఆ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల గెలుపు బాధ్యతనీ రఘురామ తీసుకునేవారే. ఇప్పుడూ ఏం తక్కువ కాదు, అంతకు మించే.. ఆయన కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారుట.
ఉండి వరకూ తీసుకుంటే, మెజార్టీ గురించిన ఆలోచన మాత్రమే రఘురామకి వుందనీ, రికార్డు మెజార్టీ ఆయనకి ఖాయమనీ అంటున్నారు. మరోపక్క, నర్సాపురం అలాగే తాడేపల్లిగూడెం అసెంబ్లీ సిగ్మెంట్లలో రఘురామ ప్రభావం చాలా చాలా పాజిటివ్‌గా కూటమికి వుండబోతోందిట. ఈ ప్రభావం నర్సాపురం లోక్ సభ సీటుపైనా సానుకూలంగా వుండబోతోంది.