కూటమి విజయాన్ని ఖరారు చేసిన వైసీపీ.?

వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.! భారీ అంచనాల నడుమ, ‘నవ రత్నాలు ప్లస్’ మేనిఫెస్టోని వైసీపీ తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

సామాజిక పెన్షన్లు ఐదు వేలు చేస్తారా.? అమ్మ ఒడి మొత్తం పెంచుతారా.? ఇలా చాలా ఉత్కంఠభరితమైన ప్రశ్నలు వైసీపీ అభిమానుల నుంచి పుట్టుకొచ్చాయ్. రైతు రుణమాఫి అంశమొకటి చర్చలోకి వచ్చింది. కానీ, తూతూ మంత్రంగా అమ్మ ఒడి మొత్తాన్ని రెండు వేలకు పెంచుతున్నట్లు ప్రకటించి వైసీపీ చేతులు దులుపుకుంది మేనిఫెస్టోలో.

సామాజిక పెన్షన్లు మరో ఐదొందల రూపాయలు మాత్రమే పెంచుతామని వైసీపీ తన మేనిఫెస్టోలో పేర్కొనడం, వైసీపీ అభిమానులైన లబ్దిదారుల్లో తీవ్ర నిరాశకు గురిచేసింది. తాము అధికారంలోకి వస్తే, పెన్షన్ నాలుగు వేలకు పెంచుతామని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అది జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది కూడా. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అంశం కూడా జనాల్లోకి వెళ్ళింది.

టీడీపీ ప్రకటించిన ఆరు గ్యారంటీలకు, వైసీపీ ‘నవ రత్నాలు ప్లస్’ తర్వాత క్రేజ్ అనూహ్యంగా పెరిగిందనేది తాజా గ్రౌండ్ రిపోర్ట్. ఈ విషయమై వైసీపీ శ్రేణుల్లోనే తీవ్ర ఆందోళన కనిపిస్తోంది.

‘కూటమికి గెలుపుని మనమే కానుకగా ఇచ్చేస్తున్నట్టున్నాం.. వైసీపీ ఓటమి ఖాయం..’ అని నిన్న మొన్నటిదాకా వైసీపీకి మద్దతుగా నిలిచిన సోషల్ మీడియా హ్యాండిల్స్ అసహనం వ్యక్తం చేస్తున్నాయి.

డ్యామేజ్ కంట్రోల్ ఎలా.? ఇప్పుడిదే చర్చ వైసీపీలో జరుగుతోందిట. మ్యానిఫెస్టోలో మార్పులు తప్పకపోవచ్చని అంటున్నారు. రెండు మూడు రోజుల్లోనే సవరించిన ఇంకో మేనిఫెస్టో వైసీపీ నుంచి విడుదల కావొచ్చునట.