విశ్వాసం ఉండడం తప్పుకాదు.. కానీ, అతి విశ్వాసం ఎప్పుడూ.. కొంప ముంచేస్తుంది. ఇప్పుడు ఈ మాట ఎవరో అనడం లేదు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా ప్రకటించిన 2024 మేనిఫెస్టో.. నవరత్నాలు 2.0
లో జగన్ విశ్వాసం కంటే.. అతి విశ్వాసం ప్రకటించారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. సాధారణంగా.. ఎన్నికల వేళ పోటీ ఉన్నప్పుడు.. ఆయా పార్టీలు అనుసరిస్తున్న తీరును గమనించాల్సి ఉంది.
ఇలా చూసుకుంటే.. భారీ ఎత్తున హామీలు గుప్పించిన టీడీపీ కూటమి ఉండగా.. అసలు నామ మాత్రంగా కూడా.. పథకాలకు సొమ్ములు ఇవ్వకుండా.. వ్యవహరించిన తీరు.. వైసీపీ వైపు కనిపిస్తోంది. అయితే.. ఈ విషయంలో జగన్ క్లారిటీ ఇచ్చారు. తాను అమలు చేస్తున్న సంక్షేమానికి రూ.70 వేల కోట్లు అవుతున్నాయని.. ఇంతకు మించి అమలు చేసే పరిస్థితి లేదన్నారు. అంటే.. ఇది ఒకరకంగా మంచిదే కావొచ్చు. కానీ, మరోవైపు.. పన్నులు పెంచనని కానీ.. పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాలపై ట్యాక్స్ తగ్గిస్తానని కానీ, చెప్పకపోవడం గమనార్హం.
అంటే.. బాదుడు కొనసాగుతుందనే సంకేతాలు వచ్చాయి. ఇక, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మీ వంటి పథకాల నిధులు కూడా పెంచలేదు. ఎలా చూసుకున్నా.. ప్రతి పథకంలోనూ పెద్దగా పెంపు లేదు. కానీ, దీని వెనుక జగన్ అతి విశ్వాసమే కనిపించింది. తాను ఏం చెప్పినా.. అది విశ్వసనీయతేనని ఆయన భావిస్తున్నారు. అందుకే.. తాను ఇచ్చిందే.. సొమ్ము.. తాను చెప్పిందే హామీ అన్నట్టుగా వండి వార్చారు. అంటే.. ఒకరకంగా. చంద్రబాబు ఇచ్చిన హామీలు.. హద్దులు మీరాయని కూడా జగన్ వెల్లడించారు.
మొత్తంగా చూస్తే.. ఇది విశ్వాసంకాదు.. అతివిశ్వాసంగానే ఉంది. ఎందుకంటే.. రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ సాధ్యం కాదన్నారు. టీడీపీ అధినేత ఏటా రూ.20 వేల వరకు సాయం ప్రకటించారు. వైసీపీ అదికూడా ఇవ్వడం లేదు. సో..ఇలా.. బాబును తొండిచేసే ప్రయత్నంలో తన అతి విశ్వాసాన్ని ప్రదర్శించుకున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు కనుక.. బాబువైపు నిలబడితే.. వెంటనే సంచలన మార్పులు ఖాయం. ఈ చిన్న లాజిక్‌ను జగన్ మిస్సయ్యారు. మరి జనం ముందు.. ఎలాంటి తీర్పును ఆయన శిరసావహించాల్సి ఉంటుందో చూడాలి.