ఏపీ సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్‌కల్యాణ్.. ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించారు. “సొంత చెల్లెలు కట్టుబొట్టుతో బాగుండాలని సగటు సోదరుడు ఎవరైనా కోరుకుంటాడు. కానీ, ఈ సీఎం జగన్‌రెడ్డి మాత్రం సొంత చెల్లి కట్టుకున్న చీరలను ఉద్దేశించి కూడా విమర్శలు చేస్తున్నాడు. రేపు మరోసారి అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో మహిళలకు ఏం రక్షణ కల్పిస్తాడు” అని ప్రశ్నించారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన పవన్.. కూటమి అభ్యర్థుల పక్షాన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన జగన్ తన సోదరి షర్మిలపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.
చెల్లెలి కట్టుకున్న బట్టలను ఏ అన్నయినా చూస్తాడా? ఫలానా రంగు బట్టలే వేసుకోవాలని నిర్దేశం చేస్తామా? అసలు మహిళలు కట్టుకున్న బట్టలు విమర్శిస్తామా? కానీ, జగన్ రెడ్డి మాత్రం సొంత చెల్లె కట్టుకున్న బట్టలనే విమర్శిస్తున్నాడని పవన్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని.. కనీసం ఒక్కసారి కూడా దీనిపై మాట్లాడలేదన్న పవన్.. సొంత చెల్లి కట్టుకున్న చీరలపై మాత్రం కామెంట్లు చేస్తున్నాడని విమర్శలు గుప్పించారు. ఇలాంటి వారిని తిరిగి అధికారంలోకి రానిస్తే..రేపు రాష్ట్రంలోని మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు.
జగన్ లాంటి దిగజారిపోయిన నాయకుడిని తాను ఎన్నడూ చూడలేదన్న పవన్.. తన ఇంట్లో వాళ్లను తిడుతున్నాడని.. చంద్రబాబు భార్యను నిండు సభలోనే అవమానించాడని.. ఇప్పుడు సొంత చెల్లిని .. పులివెందుల గడ్డపైనే విమర్శించాడని నిప్పులు చెరిగారు. ఇలాంటివారిని తరిమి కొట్టాలని మహిళలకు పిలుపునిస్తున్నట్టు చెప్పారు. ఇక, రాజోలు ఎమ్మెల్యే.. జనసేన జంపింగ్.. రాపాక వరప్రసాద్‌పైనా జనసేన అధినేత విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలతో కలిసి ఆయన కూడా అవినీతి కి పాల్పడ్డాడని.. ఇలాంటి వాడు ఇప్పుడు పార్లమెంటుకు వెళ్తే.. ప్రజాస్వామ్య అపహాస్యం అయినట్టేనని వ్యాఖ్యానించారు.
కూటమి ప్రభుత్వం 18 రోజుల్లో ఏర్పడుతుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు. తాను చూసిన, విన్న అన్ని సమస్యలను పరిష్కరించే బాధ్యత కూటమి తరఫున తాను తీసుకుంటున్నట్టు పవన్ తెలిపారు. వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన తొలిసారి కోరారు. విషప్రచారం.. చేసేవారు.. ఓటమికి చేరువ అవుతున్నారని.. అందుకే కూటమిపై విషం చిమ్ముతున్నారని అన్నారు. ఈ ప్రచారాన్ని నమ్మి… మహిళలు మోస పోవద్దని.. కూటమి ప్రభుత్వం వచ్చేందుకు 18 రోజులే ఉందని.. అందరి జీవితాలు మారుతాయని.. రాష్ట్రం అభివృద్దిలో ముందుకు సాగుతుందని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates