ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాలలో కాపు, కమ్మ, రెడ్ల మధ్య రాజకీయాలు నడిస్తే ఒక్క నెల్లూరు జిల్లాలో మాత్రం పూర్తిగా రెడ్ల రాజకీయమే నడుస్తుంది. ముఖ్యంగా కావలి నియోజకవర్గం రెడ్ల రాజకీయానికి పెట్టింది పేరు. అనాదిగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిని కావలి నియోజకవర్గం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తూ వస్తున్న ఈ నియోజకవర్గం నుండి టీడీపీ రెండు సార్లు మాత్రమే విజయం సాధించింది.
2014, 2019 ఎన్నికలలో వరసగా ఎమ్మెల్యేగా గెలిచిన వైసీపీ నేత రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నాడు. చెన్నైలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయన బెంగుళూరులో కాంట్రాక్టర్ గా రాణించాడు. ఆ తర్వాత లయన్స్ క్లబ్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. కావలి పరిధిలో ఆర్‌ఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశాడు. అంగబలంతో పాటు ఆర్థబలం కూడా దండిగా ఉన్న ఆయనను వైసీపీ మరోసారి బరిలోకి దించింది. టీడీపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి వైసీపీలో చేరడం, మరో నేత సుకుమార్ రెడ్డితో విభేధాలు తొలగిపోవడం, ఎంపీ బీద మస్తాన్ రావు సహకారం ఎమ్మెల్యేకు అనుకూల అంశాలు.
కావలిలో వైసీపీని ఎదుర్కొనేందుకు అంగ, ఆర్ధబలాలలో ఎమ్మెల్యేకు సరితూగేలా ప్రముఖ పారిశ్రామికవేత్త కావ్య కృష్ణారెడ్డిని టీడీపీ బరిలోకి దింపింది. గతంలో వైసీపీ పార్టీలో కొనసాగిన ఆయనకు నియోజకవర్గంలో మంచి గుర్తింపుతో పాటు, ట్రస్ట్ ద్వారా ఆయన ప్రజలకు అందిస్తున్న సేవలు ఇప్పుడు కలిసివచ్చే అంశాలు. ఇక అధికార పార్టీ మీద వ్యతిరేకత కూడా తన గెలుపుకు దోహదపడుతుందని ఆయన ఆశగా ఉన్నారు.
టీడీపీ, వైసీపీల మధ్య గట్టి పోరు నడుస్తుండగా సందట్లో సడేమియాలా వీరిద్దరికీ అన్ని విధాలా సరితూగే ప్రముఖ వ్యాపారవేత్త పసుపులేటి సుధాకర్ ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగాడు. గత ఎన్నికలలో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన 10 వేల ఓట్లు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత బీజేపీ, అటు నుండి టీడీపీలో చేరి టికెట్ కోసం ప్రయత్నించి విఫలమై ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాడు. 2014లో 5 వేల ఓట్లు, 2019లో 15 వేల ఓట్ల ఆధిక్యంతో నెగ్గిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తొలిసారి బరిలోకి దిగిన కావ్య క్రిష్ణారెడ్డిలలో సుధాకర్ పోటీ ఎవరికి చేటు చేస్తుంది ? కావలి ప్రజలు ఎవరిని ఆదరిస్తారో వేచిచూడాలి.