ఉండి నుంచే ఆర్ఆర్ఆర్.. మొత్తం ఐదు మార్పులు

మొత్తానికి సస్పెన్స్ వీడింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో స్పష్టత వచ్చేసింది. ఆదివారం నాడు మంచి ముహూర్తం చూసుకుని అభ్యర్థులందరికీ బీఫారాలు ఇచ్చేశారు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన రఘురామ కృష్ణంరాజు అభ్యర్థిత్వం విషయంలోనూ క్లారిటీ వచ్చేసింది.

ఆయన కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తాను సోమవారం ఉదయం 10.30 గంటలకు నామినేషన్ వేయనున్న విషయాన్ని కూడా రఘురామ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. రఘురామ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు తన స్థానాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆయన్ని నరసాపురం పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడిగా నియమించారు. ఇప్పటిదాకా ఆ పదవిలో ఉన్న మాజీ ఎంపీ తోలట సీతారామలక్ష్మిని టీడీపీ పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. దీంతో పాటుగా మరో నలుగురు అభ్యర్థులను మార్చింది తెలుగుదేశం పార్టీ.

పెందుర్తి స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో అక్కడ అవకాశం కోల్పోయిన బండారు సత్యనారాయణమూర్తికి మాడుగుల స్థానాన్ని కేటాయించారు. పాడేరు టికెట్‌ను గతంలో వెంకట రమేష్ నాయుడికి కేటాయించగా.. ఆయన్ని మార్చి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి అవకాశం ఇచ్చారు. మడకశిర నుంచి సునీల్ కుమార్ స్థానంలో ఎంఎస్ రాజుకు ఛాన్స్ ఇచ్చారు. వెంకటగిరి స్థానాన్ని ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియకు ఖరారు చేయగా.. ఇప్పుడు ఆమెను తప్పించి రామకృష్ణనే అభ్యర్థిగా ప్రకటించారు.