ఎన్నికల్లో ప్రసంగిస్తున్నట్లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తుండొచ్చుగానీ, ప్రసంగాల్ని ఆయన చదువుతున్నట్లుగా వైసీపీ క్యాడర్ సైతం అసహనం వ్యక్తం చేసే పరిస్థితి వచ్చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పటిలా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగాల్లో పస వుండటంలేదన్నది నిర్వివాదాంశం.
ప్రసంగాల్ని ఎవరో రాసిస్తోంటే, వాటిని తప్పుల్లేకుండా చదవడానికీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నానా తంటాలూ పడుతున్నారు. వాస్తవానికి, స్థానిక సమస్యల్ని ప్రస్తావించే క్రమంలో పార్టీల అధినేతలు, ఆయా అంశాల్ని ముందుగానే స్లిప్ మీద రాయించుకుని, వాటిని చదువుతుంటారు.
ఇతరత్రా సాధారణ విషయాల్నీ, రాజకీయ ప్రత్యర్థులపై విమర్శల్నీ.. తమంతట తామే.. అప్పటికప్పుడు తమ మాటలకు పదును పెట్టి విమర్శించేస్తుంటారు. అయితే, జగన్ మోహన్ రెడ్డి విషయంలో ఈ ‘చదువుడు’ కార్యక్రమం ఈ మధ్య వైసీపీ శ్రేణుల్ని బాగా ఇబ్బంది పెడుతోంది.
టీడీపీ అధినేత చంద్రబాబుని విమర్శించాలన్నా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని విమర్శించాలన్నా, చివరికి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని విమర్శించాలన్నా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్క్రిప్టు చదవడం తప్పనిసరైపోతోంది. పోనీ, ఆ స్క్రిప్టు చదవడం అయినా సరిగ్గా వుంటోందా.? అంటే, అదీ లేదాయె.
పాలకొల్లు, గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో పవన్ ఓడిపోయారనీ, పిఠాపురంలోనూ ఓడిపోతారనీ వైఎస్ జగన్ తాజాగా చదివిన ప్రసంగం అందర్నీ విస్మయానికి గురిచేసింది. వైసీపీ శ్రేణులే ఈ ప్రసంగంతో అవాక్కయ్యారనడం అతిశయోక్తి కాదు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బస్సు యాత్ర సందర్భంగా వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు, వైసీపీ మద్దతుదారులు సమర్థించుకోలేని విధంగా మారాయి.
ఇకనైనా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగాల్ని చదవడం మానేస్తే మంచిదనీ, మునుపటిలా వైఎస్ జగన్, పదునైన ప్రసంగాలు చేయాలని వైసీపీ మద్దతుదారులే సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates