ట‌చ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలా? ఇదేం లాజిక్ కేసీఆర్‌?

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతుంటే ఓ అర్థం ఉండేది. ఆయ‌న మాట‌లు తూటాల్లాగా ప‌నిచేసేవి. ఆయ‌న స్పీచ్ కార్య‌క‌ర్త‌ల ర‌క్తాన్ని మ‌రిగించేది.. ఇదీ ఒక‌ప్పుడు కేసీఆర్ మాట‌తీరుపై ఉన్న అభిప్రాయం. కానీ ఇప్పుడ‌ది మారుతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. స‌గ‌టు రాజ‌కీయ నాయ‌కుడిలా కేసీఆర్ కూడా నోటికి ఏది వ‌స్తే అదే మాట్లాడుతున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాజాగా కాంగ్రెస్‌కు చెందిన‌ 20 మంది ఎమ్మెల్యేలు త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లే ఇందుకు రుజువు అని విశ్లేష‌కులు చెబుతున్నారు. అస‌లు ఈ వ్యాఖ్య‌ల్లో లాజిక్ ఏమిటో అర్థం కావ‌డం లేద‌ని అంటున్నారు.

గ‌త తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌కు చావుదెబ్బ త‌గిలింది. కాంగ్రెస్ చేతిలో అనూహ్య ఓట‌మికి గురైంది. తెలంగాణ ఏర్ప‌డ్డాక వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లో గెలిచిన బీఆర్ఎస్‌.. నిరుడు తొలిసారి ప‌రాజ‌యం పాలైంది. దీని నుంచి కోలుకుంటున్న స‌మ‌యంలోనే పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వ‌ల‌స‌లు కేసీఆర్‌కు మ‌రింత త‌ల‌నొప్పిగా మారాయి. మ‌రోవైపు లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోనూ తెలంగాణ‌లో బీఆర్ఎస్‌కు ప్ర‌తికూల ఫ‌లితాలు వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌నే అంచనాలు కేసీఆర్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయ‌ని టాక్‌. ఇలాంటి స‌మ‌యంలో పార్టీపై కార్య‌క‌ర్త‌ల‌కు న‌మ్మ‌కం పోకుండా, పార్టీలో మిగిలిన నాయ‌కులు కూడా జంప్ కాకుండా చూసేందుకు కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని స‌మాచారం. బీఆర్ఎస్‌తో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారంటే అప్పుడు కార్య‌క‌ర్త‌ల‌కు కూడా పార్టీపై ఇంకా న‌మ్మ‌కం ఉంటుంది.

అందుకే ఈ లోక్‌స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత రాష్ట్రంలో రాజ‌కీయ గంద‌ర‌గోళ ప‌రిస్థితి త‌లెత్త‌నుంద‌ని కేసీఆర్ వ్యాఖ్యానించార‌ని చెప్పాలి. అప్పుడు బీఆర్ఎస్ కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని నాయ‌కుల్లో న‌మ్మ‌కం పెంచేలా మాట్లాడారు. లేక‌పోతే 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి వ‌చ్చేస్తామంటే కేసీఆర్ వ‌ద్ద‌న‌డం ఏమైనా న‌మ్మ‌శ‌క్యంగా ఉందా? అధికారంలో ఉన్న పార్టీలో నుంచి మ‌నుగ‌డ‌నే ప్ర‌మాదంలో ప‌డ్డ బీఆర్ఎస్ పార్టీలోకి ఎవ‌రైనా వ‌స్తారా? అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పార్టీకి ఒక‌ట్రెండు సీట్లు మాత్ర‌మే వ‌స్తాయ‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. ఈ స‌మ‌యంలో కార్య‌క‌ర్త‌ల్లో మ‌నోధైర్యం నింప‌డానికే కేసీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేశార‌ని విశ్లేష‌కుల అంచ‌నా.