కోర్టు తీర్పు – సునీత ఆవేద‌న‌.. ఆల్ట‌ర్నేట్ ఏంటి?

రాష్ట్రంలో అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. వీటికి సంబంధించిన ప్ర‌చారం జోరుగా సాగుతోంది. అధికార పార్టీ వైసీపీని.. సీఎం జ‌గ‌న్‌ను అధికారం నుంచి దించేయాల‌న్న‌ది అంద‌రి వ్యూహం . రాజ‌కీయాల్లోప్ర‌త్య‌ర్థులుగా ఉన్న వారు.. కోరుకునేది ఇదే కాబ‌ట్టి దీనిని ఎవ‌రూ త‌ప్పుగా అర్ధం చేసుకోవా ల్సిన అవ‌స‌రం లేదు. కానీ, ఎటొచ్చీ.. వ్య‌తిగ‌త విష‌యాలు.. ఎప్పుడో ఐదేళ్ల కింద‌ట జ‌రిగిన విష‌యాల‌ను త‌వ్వి తీయ‌డ‌మో.. లేక ఒక కుటుంబానికి న్యాయం జ‌ర‌గ‌లేద‌న్న కార‌ణంగా ఆ విష‌యాల‌పై ఎక్కువ‌గా స్పందించ‌డమో చేయ‌డమే ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌ను అంద‌రూ ముక్త‌కంఠంతో ఖండించారు. ఈవిష‌యంలో రెండో మాట‌లేదు. కానీ, 2019 ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన ఈ దారుణాన్ని ఇప్ప‌టి ఎన్నిక‌ల్లో వాడుకోవ‌డ‌మే అభ్యంత‌రంగా మారింది. దీనినే క‌డప కోర్టు కూడా ప్ర‌శ్నించింది. సునీత‌, ష‌ర్మిల పై ముఖ్యంగా తీవ్ర వ్యాఖ్య‌లే చేసింది. ఇది కొన్ని మీడియాల్లో వ‌చ్చింది.. మ‌రికొన్నింటిలో అస‌లు ఈ విష‌య‌మే రాలేదు. ఇది వేరే సంగ‌తి. అయితే.. వివేకా హ‌త్య విష‌యాన్ని మాత్రం ఎక్క‌డా ప్ర‌స్తావించ‌రాద‌ని కోర్టు ఆదేశించింది.

ఎన్నిక‌లు ముగిసే వ‌ర‌కు వివేకాహ‌త్య‌పై అధికార ప్ర‌తిప‌క్షాలు కూడా మాట్లాడ‌వ‌ద్ద‌ని తేల్చి చెప్పింది. అయితే.. క‌డ‌ప‌ లో న్యాయం కోరుతూ.. తాము ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేస్తుంటే.. కోర్టు ఇలా అడ్డు చెప్ప‌డం స‌రికాద‌నేది సునీత ఆవేద‌న‌. దీని పై హైకోర్టుకు వెళ్తామ‌ని కూడా ఆమె చెప్పారు. కానీ, అక్క‌డ కూడా ఆమెకు ఊర‌ట‌ల‌భించ‌క‌పోవ‌చ్చు. ఎందుకంటే.. 2019 ఎన్నిక‌ల వేళ‌.. అప్ప‌టి పార్టీలు ఇలానే వివేకా హ‌త్య కేసును ఎన్నిక‌ల ప్ర‌చారానికి వాడుకున్న‌ప్పుడు.. స్వ‌యంగా వివేకా స‌తీమ‌ణి(సునీత త‌ల్లి) సౌభాగ్య‌మ్మ కోర్టుకు వెళ్లారు.

త‌న భ‌ర్త మ‌ర‌ణాన్ని రాజ‌కీయంగా వాడుకుంటున్నార‌ని.. దీనిని అడ్డుకోవ‌ల‌ని కోరారు. దీంతో హైకోర్టు అప్ప‌ట్లో ఇవే ఆదేశాలు ఇచ్చింది. దీంతో వివేకా గురించి ప్ర‌చారం ఆగిపోయింది. అయితే.. ఇప్పుడు క‌డ‌ప కోర్టు ఇదే ఆదేశాలు జారీ చేసింది. మ‌రి ఇప్పుడు సునీత ముందున్న ప‌రిస్థితి ఏంటి? ప్ర‌త్యామ్నాయం ఏంటి? అనేది ప్ర‌శ్న‌. త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని.. ఆమె వివ‌రించే అవ‌కాశం ఉంది. అయితే.. వివేకా పేరును మాత్ర‌మే వెల్ల‌డించ‌డానికి వీల్లేదు. ఇంత‌కు మించి.. జ‌గ‌న్ పాల‌న‌ను టార్గెట్ చేసుకోవ‌చ్చు.. అభివృద్ది లేద‌ని, రాజ‌ధాని లేద‌ని.. ఇసుక‌, క‌డ‌ప ఉక్కు ఇలా.. అనేక అంశాలు ఉన్నాయి. మ‌రి ప్ర‌త్యామ్నాయం కోసం చూస్తారో.. లేక‌, న్యాయ పోరాటమే ఎంచుకుంటారా చూడాలి.