సిటింగ్ ఎంపీగా ఉన్న ఆ నాయకుడు బీఆర్ఎస్‌ను వదిలి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. కానీ అక్కడ సీటు దక్కలేదు. అక్కడి వెళ్లాక ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. దీంతో ఇప్పుడా నేత బీజేపీలోకి జంప్ అయేందుకు చూస్తున్నారు. బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ ఆ నాయకుడు ఎవరో కాదు పెద్దపల్లి సిటింగ్ ఎంపీ వెంకటేశ్ నేత. గత ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచిన ఆయన.. ఈ సారి ఎన్నికలకు ముందు కేసీఆర్‌కు షాకిచ్చి కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు. కానీ కాంగ్రెస్ అధిష్ఠానం వెంకటేశ్‌కే షాకిచ్చింది.
పెద్దపల్లి టికెట్ వెంకటేశ్‌కు ఇవ్వకుండా గడ్డం వివేక్ తనయుడు వంశీకృష్ణను పోటీలో నిలిపింది. దీంతో టికెట్ హామీతో కాంగ్రెస్‌లో చేరి భంగపడ్డ వెంకటేశ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. మరోవైపు ఇక్కడ విజయం కోసం కసరత్తులు చేస్తున్న బీజేపీ.. ఇదే సమయంలో వెంకటేశ్‌పై కన్నేసిందని టాక్. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా గోమాసె శ్రీనివాస్‌ను బీజేపీ నిలబెట్టింది. కానీ ఆయన ప్రచారంలో పెద్దగా పాల్గొనడం లేదని, స్థానిక నేతలను కలుపుకొని వెళ్లడం లేదని పార్టీ అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఇక పెద్దపల్లి లోక్‌సభ నియోజవకర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో వంశీకృష్ణను ఢీ కొట్టే దమ్ము శ్రీనివాస్‌కు లేదని బీజేపీ భావిస్తోంది.
అందుకే కాంగ్రెస్‌కు దీటుగా బలమైన నేతను నిలబట్టేలనే ప్రయత్నాల్లో మునిగిపోయింది. ఇప్పుడు వెంకటేశ్ నేత బీజేపీకి దిక్కుగా మారారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో గెలిచిన ఆయనకు ఈ నియోజకవర్గంపై పట్టుంది. ఇక ఈ సారి తెలంగాణలో డబుల్ డిజిట్ లోక్‌సభ స్థానాలు గెలవాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ కూడా వలసలను ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభావం చూపగలిగే నాయకులను చేర్చుకుని టికెట్లు ఇస్తోంది. ఈ క్రమంలోనే వెంకటేశ్‌ను పెద్దపల్లిలో నిలబెట్టేలా అమిత్‌షాతో చర్చించినట్లు సమాచారం. నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉండాలని వెంకటేశ్‌కు ఆదేశాలు కూడా వెళ్లినట్లు తెలిసింది.