మంత్రి జోగి రమేష్ కు బామ్మర్థుల షాక్

బామ్మర్దులు అంటే బావ బతుకు కోరుతరు అని అంటారు. సాలే బౌనే ఏక్ తరఫ్ .. సారీ దునియా ఏక్ తరఫ్ అన్న నానుడి కూడా ఉంది. కానీ రాజకీయాల్లో ఈ నానుడి నిజం కాదు అనడానికి ఆంధ్రప్రదేశ్ గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కు ఆయన బామ్మర్ధులు, బంధుగణం ఇచ్చిన షాక్ నిదర్శనం. ఎన్నికల సమయంలో కొందరు నేతలు కండువాలు మార్చడం కామన్. కానీ సొంత బామ్మర్దులే పార్టీ మారడం ఎవరికైనా ఇబ్బందికర పరిణామమే.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జోగి రమేష్ బామ్మర్దులు పామర్తి దుర్గాప్రసాద్, పామర్తి దుర్గారావు, పామర్తి వెంకటేశ్వరరావులతో పాటు మరో 40 మంది బంధువర్గం ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటి ఎదుట ఏర్పాటు చేసిన సభా వేదిక ద్వారా మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత క్రిష్ణప్రసాద్ సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకోవడం గమనార్హం. రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్న రమేష్ కు ఈ సమయంలో ఈ పరిణామాలు ఒక పట్టాన మింగుడుపడవనే చెప్పాలి.