రేవంత్ వెళ్తాడ‌ని కేటీఆర్‌.. వెళ్ల‌డ‌ని కేసీఆర్‌

లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారంలో సాగుతున్న బీఆర్ఎస్ నాయ‌కులు ప‌దేప‌దే ఒక మాట అంటూనే ఉన్నారు. ముఖ్యంగా ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ అయితే ఈ అంశం లేకుండా ఎక్క‌డా స్పీచ్ ముగించ‌డం లేదు. అది ఏమిటంటే.. పీసీసీ అధ్య‌క్షుడు, సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తార‌ని. కాంగ్రెస్‌ను మోసం చేసి కాషాయ కండువా క‌ప్పుకుంటార‌ని. కానీ తాజాగా బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాత్రం డిఫెరెంట్ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. రేవంత్ బీజేపీలోకి వెళ్ల‌డ‌ని కేసీఆర్ పేర్కొన్నారు. ఇలా త‌న‌యుడు కేటీఆర్ ఒక‌మాట‌, తండ్రి కేసీఆర్ ఒక మాట మాట్లాడుతుండ‌టం.. అది కూడా వాస్త‌వ ప‌రిస్థితికి విరుద్ధంగా ఉండ‌టం హాస్యాస్ప‌దంగా మారింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

తాజాగా బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు బీఫారాలు అంద‌జేసిన కేసీఆర్ ఈ సంద‌ర్భంగా చాలా విష‌యాల‌పై మాట్లాడారు. ఇందులో భాగంగానే రేవంత్‌పై వ్యాఖ్య‌లు చేశారు. రేవంత్ బీజేపీలోకి వెళ్ల‌క‌పోవ‌చ్చ‌ని కేసీఆర్ అన్నారు. ఒక‌వేళ వెళ్లినా ఆయ‌న వెంట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్ల‌క‌పోవ‌చ్చ‌ని మ‌రో మాట కూడా చెప్పారు. ఒక‌ప్పుడు ఎంఎఐంతో క‌లిపి 111 అసెంబ్లీ సీట్ల‌తో ప‌టిష్ఠంగా ఉన్న బీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టేందుకు బీజేపీ కుట్ర చేసింద‌ని ఆరోపించారు. అలాంటిది ఇప్పుడు 65 సీట్ల‌తోనే ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని బీజేపీ వ‌దిలిపెడుతుందా అని కేసీఆర్ ప్ర‌శ్నించారు. అయితే రేవంత్ బీజేపీలోకి వెళ్ల‌క‌పోవ‌చ్చ‌ని ఈ సంద‌ర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్‌ను ఏదోలా బీజేపీలో చేర్చుకున్నా.. ఆయ‌న వెంట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం వెళ్ల‌ర‌ని కేసీఆర్ పేర్కొన్నారు.

మ‌రోవైపు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల స‌భ‌లు, స‌మావేశాల్లో పాల్గొంటున్న కేటీఆర్ మాత్రం రేవంత్ విష‌యంలో విభిన్న‌మైన లాజిక్ మాట్లాడుతున్నారు. రేవంత్ క‌చ్చితంగా బీజేపీతో క‌లుస్తార‌ని కేటీఆర్ చెబుతున్నారు. ఈ లోక్‌స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత అదే జ‌రుగుతుంద‌ని మ‌రీ నొక్కి వ‌క్కాణిస్తున్నారు. ఇలా చెప్ప‌డం ద్వారా బీజేపీ, కాంగ్రెస్ ఒక‌టేన‌నే భావ‌న తీసుకొచ్చి బీఆర్ఎస్‌కు ఓట్లు సంపాదించేందుకు కేటీఆర్ వేసిన ప్లాన్‌గా ఇది తెలుస్తోంది. కానీ రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న ఉన్న సాధార‌ణ వ్య‌క్తికి కూడా రేవంత్ బీజేపీలోకి ఎందుకు వెళ్తార‌నే ప్ర‌శ్న క‌లుగుతోంది. ముఖ్య‌మంత్రిగా ఉన్న ఆయ‌న ఇప్పుడు తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కు. అలాంటిది ప‌ద‌వి, గౌర‌వం వ‌దులుకుని బీజేపీ క‌డ‌ప తొక్కాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని అంటున్నారు. మ‌రి ఈ విష‌యంలో కేసీఆర్‌, కేటీఆర్ లాజిక్ ఏమిటో వాళ్ల‌కే అర్థ‌మ‌వ్వాలి.