నా భర్త మీద పోటీ చేస్తా .. ఓడిస్తా

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నుండి ఈ నెల 22న స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని, నా భర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ సతీమణి, జడ్పీటీసీ సభ్యురాలు వాణి తన అనుచరుల ముందు ప్రకటించి ప్రతినబూనారు. తన జన్మదినం సంధర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన అభిమానుల ముందు ఆమె ఈ విషయం ప్రకటించి కలకలంరేపారు.

దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి శాసనసభ స్థానం నుండి శుక్రవారం నామినేషన్ వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే హఠాత్తుగా ఆయన భార్య పోటీ విషయం వెల్లడించడంతో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గందరగోళం మొదలయింది. కొంతకాలంగా భార్యభర్తల మధ్య ఉన్న విభేదాల మూలంగా ఈ పరిస్థితి దాపురించిందని పార్టీ కార్యకర్తలు అంటున్నారు.

దువ్వాడ వ్యవహారశైలి మూలంగా టెక్కలి నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బందులు వస్తున్నాయని ఆయన సతీమణి వాణి నేరుగా ముఖ్యమంత్రి జగన్ కు చెప్పినట్లు సమాచారం. ఆ పరిస్థితులలో నియోజకవర్గ ఇంఛార్జ్ గా పార్టీ వాణిని నియమించింది. అయితే అభ్యర్థిగా మాత్రం భర్త దువ్వాడ శ్రీనివాస్ ను ప్రకటించింది. దీంతో పార్టీతో విభేధించిన వాణి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న కొందరు నాయకుల ప్రోత్సాహంతో వాణి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం.