జ‌గ‌న్‌ను చంపేయాల‌ని అనుకున్నారు: రిమాండ్ రిపోర్టు

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై విజ‌య‌వాడ శివారు ప్రాంతం సింగున‌గ‌ర్‌లో జ‌రిగిన రాయి దాడి ఘ‌ట‌న‌ పై పోలీసులు స‌మ‌ర్పించిన రిమాండ్ రిపోర్టులో సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు. సీఎం జ‌గ‌న్‌ను చంపేయాల‌నే భావించార‌ని, దీనికి కుట్ర ప‌న్నార‌ని, ప‌దునైన రాయిని బ‌లంగా విసిరి కొట్టార‌ని త‌మ రిపోర్టులో పేర్కొన్నారు. నిందితుడు మేముల స‌తీష్‌.. స్వ‌యంగా ఈ రాయిని విసిరిన‌ట్టు పోలీసులు తెలిపారు. అయితే.. అదృష్ట‌వ శాత్తు రాయి గురి త‌ప్పింద‌ని.. లేక‌పోతే.. సీఎం జ‌గ‌న్ ప్రాణాల‌కు ముప్పు ఏర్ప‌డి ఉండేద‌ని పోలీసులు తెలిపారు. కాల్ డేటా, సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని ఈ నెల 17న అరెస్టు చేసిన‌ట్టు పేర్కొన్నారు.

స‌జ్జ‌ల వ్యాఖ్య‌లు ఇవీ..

సీఎం జ‌గ‌న్‌పై జ‌రిగిన రాయి దాడి వెనుక ఆక‌తాయిలు లేర‌ని స‌ల‌హాదారు, వైసీపీ అగ్ర‌నేత స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తెలిపారు. దీని వెనుక చాలా పెద్ద నేత‌లే ఉన్నార‌ని తాము అనుమానిస్తున్న‌ట్టు చెప్పారు. అది సెంట్ర‌ల్ టీడీపీ నేత బొండా ఉమా మ‌హేశ్వ‌ర రావా? మ‌రొక‌రా? అనేది పోలీసుల విచార‌ణ‌లో తేలుతుంద‌ని చెప్పారు. అలాగ‌ని ఊరికేనే ఎవ‌రో కేసులో ఇరికించాల్సిన అవస‌రం త‌మ‌కు లేద‌న్నారు. ఇక‌, ఈ కేసు విష‌యంలో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ చేస్తున్న వ్యాఖ్య‌ల‌ను తాము ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని స‌జ్జ‌ల చెప్పారు. ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రిపై దాడి జ‌రిగితే ఏమాత్రం బాధ్య‌త లేకుండా మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు.

ఎవరినో ఈ కేసులో ఇరికించాల్సిన అవసరం మాకు ఏముంది. బొండా ఉమానా, దీని వెనుక‌ ఆయన కంటే పెద్ద వాళ్ళు ఉన్నారా? విచారణలో తేలుతుంది. తప్పు చేసిన వాడు తనను ఇరికించారని మాట్లాడితే చెల్లుతుందా..? అని స‌జ్జ‌ల వ్యాఖ్యానించారు. ఈ కేసు విచార‌ణ‌ను నిష్ప‌క్ష పాతంగా చేప‌ట్టాల‌ని ప్ర‌తిప‌క్షాల కంటే కూడా తామేఎక్కువ‌గా చూస్తున్నామ‌ని. కోరుతున్నామ‌ని తెలిపారు.

టీడీపీ రియాక్ష‌న్‌..

ఈ కేసులో ఏ1గా సతీష్ అనే యువ‌కుడిని అరెస్టు చేయ‌డంపై టీడీపీస్పందించింది. స‌తీష్‌ను అన‌వ‌స‌రంగా ఇరికించార‌ని.. ఈ కేసు పెద్ద‌ది కాద‌ని పార్టీనాయ‌కుడు ఒక‌రు వ్యాఖ్యానించారు. రాష్ట్ర పోలీసుల నిర్ల‌క్ష్యంతోనే గుల‌క‌రాయి ఘ‌ట‌న జ‌రిగింద‌న్నారు. కానీ, అదే పోలీసులు విచార‌ణ చేసి.. హ‌త్య చేసేందుకు ప్ర‌య‌త్నించార‌ని అన‌డం హాస్యాస్పంద‌గా ఉంద‌ని పేర్కొన్నారు. ఈ కేసును సీబీఐకి ఇస్తే త‌ప్ప‌.. నిజానిజాలుబ‌య‌ట‌కు రావని అభిప్రాయ‌ప‌డ్డారు.