లోకేష్ కు ముహూర్తం పెట్టిన త‌మిళ‌నాడు పురోహితులు!

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండో సారి పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. గురువారం నామినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం కాగానే.. ఆయ‌న గుంటూరు జిల్లాలో తొలి నామినేష‌న్ వేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో పాతమంగళగిరి సీతారామ కోవెల నుంచి వేలాదిమందితో ర్యాలీగా బ‌య‌లు దేరి వెళ్లారు. ఈ క్ర‌మంలో మంగళగిరి ప్రధాన రహదారులు ప‌సుపు జెండాలో మూసుకు పోయాయి. కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నారా లోకేష్‌కు మద్ద‌తు తెలిపారు.

అదేస‌మ‌యంలో కూటమి పార్టీలైన బీజేపీ, జ‌న‌సేనల నుంచి కూడా కీల‌క నాయ‌కులు హాజ‌ర‌య్య‌రు. సీతారామస్వామి కోవెల, మిద్దె సెంటర్ నడుమ భారీగా జనసందోహం హాజ‌రై.. నారా లోకేష్‌కు ముంద‌స్తు అభినంద‌న‌లు తెలిపారు. అనంత‌రం.. నారా లోకేష్‌.. ఎంపీ అభ్య‌ర్థి చంద్ర‌శేఖ‌ర్ తో క‌లిసి మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని నామినేష‌న్ ప‌త్రాలు దాఖ‌లు చేయ‌నున్నారు. ఆయ‌న త‌ర‌ఫున ఎస్సీ,ఎస్టీ,బిసి , మైనారిటీ నేతలు కూడా.. మ‌రో రెండు నామినేషన్ సెట్ల‌ను అందించ‌నున్నారు.

ఈ కార్య‌క్ర‌మానికి నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో మంగళగిరి మిద్దె సెంటర్ మీదుగా ప్రధాన రహదారికి ర్యాలీ చేరుకుంది. ర్యాలీకి అడుగడగునా సంఘీభావం క‌నిపించింది. భారీ సంఖ్యలో హాజరైన మంగళగిరి ప్రజలు, మహిళలు, యువతీ యువకులు ప‌లువురు.. నారా లోకేష్‌కు హార‌తులు ప‌ట్టారు. కాగా, నారా లోకేష్ నామినేష‌న్ ఘ‌ట్టానికి త‌మిళ‌నాడులోని శ్రీరంగ నాథ స్వామి ఆల‌య పూజారులు ముహూర్తం పెట్టిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి.