జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకింత అసహనానికి గురవుతున్నారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీరియస్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు.. ఇవన్నీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తన నేపథ్యంలోనే.!
విషయమేంటంటే, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై అత్యంత జుగుప్సాకరమైన రీతిలో మాటల దాడి చేస్తున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వైఎస్ జగన్ అంటే ఆషామాషీ వ్యక్తి కాదు. బాధ్యతగల ముఖ్యమంత్రి పదవిలో వున్నారాయన. ఓ పార్టీ అధినేత కూడా.!
‘కార్లను మార్చినట్లు భార్యల్ని మార్చుతాడు..’, ‘నలుగురు నలుగురు పెళ్ళాలు..’ అంటూ పదే పదే వైఎస్ జగన్ చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీ కార్యకర్తల్లోనే కొందరికి రుచించడంలేదు. ‘ఇలాగే పవన్ కళ్యాణ్ కూడా వైఎస్ జగన్ పెళ్ళాం గురించి మాట్లాడితే ఎలా వుంటుంది.?’ అన్న చర్చ సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తల్లోనే జరుగుతోంది.
‘వైఎస్ జగన్ ఈ పద్ధతి మార్చుకోకపోతే, మహిళా ఓటు బ్యాంకు వైసీపీకి దూరమవుతుంది..’ అన్న భావన వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతుండడం గమనార్హం. ఆ సెక్షన్ వైసీపీ మద్దతుదారుల్ని తన దార్లోకి తెచ్చుకోవడానికా.. అన్నట్లు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తి సంయమనం పాటిస్తున్నారు.
‘నేను కూడా నీ విషయంలో అలాంటి మాటలే మాట్లాడటం ఎంత సేపు జగన్.? కానీ, మాకు సంస్కారం వుంది. మేం, మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద అంతలా దిగజారుడు వ్యాఖ్యలు చేయలేం..’ అని నిన్నటి మచిలీపట్నం ఎన్నికల ప్రచారం సందర్భంగా నిర్వహించిన సభ వేదికగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
వైఎస్ జగన్ ఏ వ్యూహంతో పవన్ కళ్యాణ్ మీద అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారోగానీ, అవి ఓ రకంగా పవన్ కళ్యాణ్‌కి అడ్వాంటేజ్ అవుతున్నాయి. ఈ మధ్య పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో మహిళలు ఎక్కువగా కనిపిస్తున్నారంటే, దానర్థం.. వైఎస్ జగన్ వ్యాఖ్యల విషయమై జనసేనానికి సింపతీ పెరుగుతోందనే కదా.!
Gulte Telugu Telugu Political and Movie News Updates