హోదా మెలిక పెట్టాల్సిందిగా జగన్?

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు.. కేంద్రం మెడలు వంచి అయినా దాన్ని కచ్చితంగా సాధిస్తాం అని ఎన్నికల ముంగిట గర్జించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. దీంతో పాటుగా అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చారాయన. కానీ అధికారం చేపట్టిన కొన్ని రోజులకే హోదా విషయంలో కాడి వదిలేసినట్లు కనిపించారు జగన్.

కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారు పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిందని, మెజారిటీ కోసం తమ మీద ఆధారపడే పరిస్థితి లేదు కాబట్టి హోదా గురించి గట్టిగా డిమాండ్ చేసే పరిస్థితి లేదని.. కానీ ఆ హామీ విషయంలో రాజీ పడేది లేదని అన్నారు జగన్. ఆ తర్వాత హోదా ఊసే ఎత్తలేదు. కట్ చేస్తే తాజాగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవికి ఎన్నికలు జరిగాయి. ఎన్డీయే అభ్యర్థి హరివంశ్ నారాయణసింగే మరోసారి డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.

ఐతే రాజ్యసభలో ఎన్డీఏ బలం 110 మాత్రమే. తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఇంకో 13 మంది సభ్యుల మద్దతు అవసరమైంది. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ సభకు గైర్హాజరై మోడీ సర్కారు పట్ల తమ వ్యతిరేకతను చూపించింది. ఐతే వైకాపాతో పాటు తెలుగుదేశం సభ్యులు సభలోనే ఉన్నారు. వాళ్లు ఎన్డీయే అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయడానికి సిద్ధమైనట్లు స్పష్టమైంది. ప్రతిపక్షాలు అభ్యర్థిని నిలిపినప్పటికీ.. ఎన్డీయే అభ్యర్థి గెలవడం లాంఛనమే అని తేలిపోవడంతో ఓటింగ్‌కు పట్టుబట్టలేదు.

దీంతో ఓటింగ్ లేకుండానే మూజువాణి ఓటుతో ఎన్డీయే అభ్యర్థి నెగ్గారు. ఐతే తమ మీద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధారపడే పరిస్థితి వచ్చిందని తెలిసినపుడు.. తమ మద్దతు కావాలంటే హోదా ఇవ్వమని డిమాండ్ చేసి ఉండొచ్చు. వెంటనే హోదా రాకపోవచ్చు. కానీ దీని మీద ఒక చర్చ జరగడానికి అవకాశముండేది. కానీ అదేమీ చేయకుండా వైకాపా సభ్యులంతా ఎన్డీయేకు మద్దతుగా నిలిచారన్నది స్పష్టం. తెలుగుదేశం సంగతి తీసుకుంటే వాళ్లకు ఉన్నదే ముగ్గురు ఎంపీలు. వాళ్లు డిక్టేట్ చేసే పరిస్థితుల్లో లేరు. వైకాపాకు ఆ అవకాశం ఉన్నా అలా ఏమీ చేయలేదు. మరి హోదా విషయంలో జగన్ చిత్తశుద్ధి ఏంటి?