కేంద్రం మాట‌.. ఫేక్ న్యూస్ వ‌ల్లే ఆ ప్రాణాలు పోయాయ‌ట‌

లాక్ డౌన్ మొద‌లైన ఆరంభంలో వ‌ల‌స కూలీలు ఎన్నెన్ని క‌ష్టాలు ప‌డ్డారో అంద‌రూ చూశారు. ఉన్న చోట ఉపాధి లేక‌.. త‌ట్టా బుట్టా చేత ప‌ట్టుకుని పిల్ల‌ల్ని క‌టిక ఎండ‌లో పిల్ల‌ల్ని న‌డిపించుకుంటూ.. స‌రైన తిండి కూడా లేకుండా వంద‌ల కిలోమీట‌ర్లు న‌డిచి వెళ్లిన ద‌య‌నీయ ప‌రిస్థితులు చూసి అంద‌రికీ క‌న్నీళ్లొచ్చాయి. ఈ క్ర‌మంలో ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు.

ఈ విష‌యంలో ప్ర‌భుత్వాలు బాధ్య‌తారాహిత్యంగా వ్య‌వ‌హ‌రించాయ‌న్న‌ది స్ప‌ష్టం. సోనూ సూద్ లాంటి వాళ్లు చొర‌వ తీసుకుని ముంబ‌యి లాంటి న‌గ‌రాల నుంచి వ‌ల‌స కార్మికుల్ని గ‌మ్య స్థానాల‌కు చేర్చ‌డం తెలిసిన సంగ‌తే. కానీ అంత‌కంటే ముందు ఎన్నో ఘోరాలు జ‌రిగాయి.

ఐతే అప్పుడు వ‌లస కూలీలు చ‌నిపోవ‌డానికి కార‌ణం కేవ‌లం ఫేక్ న్యూస్ అంటూ కేంద్ర ప్ర‌భుత్వం తేల్చి చెప్పేయ‌డం గ‌మ‌నార్హం. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల రాయ్ అడిగిన ప్రశ్నకు పార్లమెంట్‌లో కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ ఈవిధంగా సమాధానం ఇచ్చారు. ‘‘లాక్‌డౌన్ సమయంలో అనేక మంది వలస కూలీలు చనిపోయిన మాట నిజ‌మే. అయితే ఆ సమయంలో ఒక ఫేక్ న్యూస్ వైరల్ అయింది. ఆ భయంతోనే చాలా మంది చనిపోయారు.వారిపై ఆ ఫేక్ న్యూస్ చాలా ప్రభావాన్ని చూపించింది. కాగా, ఆ సమయంలో ఆహారం, తాగునీరు, ఆరోగ్య సేవలు, ఆశ్రయం వంటి ప్రాథమిక అవసరాలను తగినంతగా సరఫరా చేయకపోయామని విచారం వ్యక్తం చేస్తున్నాం. ఐతే లాక్‌డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం చాలా అప్రమత్తమై ఉంది. జ‌నాల‌కు ఇబ్బందులు రాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నాం’’ అని కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అన్నారు.

లాక్‌డౌన్ సమయంలో చనిపోయిన వారి డేటా తమ వద్ద లేదని కొద్ది రోజుల క్రితం అన్న కేంద్రం.. ఇప్పుడీ ప్ర‌క‌ట‌న‌తో మ‌రోసారి విమ‌ర్శ‌లెదుర్కొంటోంది.