‘గులక రాయి’ సర్వే ఏం చెబుతోందంటే.!

కాదేదీ కవితకనర్హం అన్నాడో సినీ కవి.! కాదేదీ, రాజకీయ సర్వేకి అనర్హం.. అని ఇకపై రాజకీయ కవులు చెప్పుకోవాల్సి వుంటుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల వేళ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడి ఘటన అది.

గులక రాయి అన్నారు.. ఎయిర్ గన్ అన్నారు.. ఫుట్ పాత్ కోసం వినియోగించే సిమెంట్ బ్లాక్ తాలూకు ముక్క అంటున్నారు.. దేంతో నిందితులు దాడి చేశారన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి వుంది. ఐదుగురు నిందితులు అదుపులో వున్నారట.

ఇంకోపక్క, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన మీద దాడి జరిగిన తర్వాత ఓ రోజు రెస్ట్ తీసుకున్నారు వైద్యుల సూచన మేరకు. తిరిగి బస్సు యాత్ర ప్రారంభించారు. తొలి రోజు చిన్న ప్లాస్టర్ అంటించిన వైద్యులు, రెండో రోజు కాస్త పెద్ద ప్లాస్టర్ అంటించారు. ఆ సంగతి అలా వుంచితే, ఈ దాడి ఘటన తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎలా మారాయన్నదానిపై ఔత్సాహికులు మెరుపు సర్వేలు షురూ చేశారు.

కొన్ని మీడియా సంస్థల సహాయ సహకారాలతో ఈ సర్వేలు జరుగుతున్నాయి. వాటిల్లో కొన్ని సర్వేలు షాకింగ్ రెస్పాన్స్ చూస్తున్నాయట జనం నుంచి. ‘ఇదో పబ్లిసిటీ స్టంట్’ అని జనం చాలా వరకు తేల్చేస్తున్నారన్నది ప్రముఖంగా వినిపిస్తున్న వాదన. సాధారణంగా ఇలాంటి సర్వేలు, ఆయా రాజకీయ పార్టీలకు నేరుగా వివరాల్ని తెలియజేస్తాయి. అక్కడి నుంచి లీకులు మాత్రమే వస్తాయ్.

ఘటన జరిగిన ఉమ్మడి కృష్ణా జిల్లాలో అయితే, జీరో ఇంపాక్ట్ కనిపిస్తోందిట.. సింపతీ పరంగా.! ఘటన జరిగింది, యాత్ర కొనసాగించారు.. అర్థరాత్రి ఆసుపత్రికి వెళ్ళారు.. సో, ఇదంత సీరియస్ కాదు.. అనే చర్చ విజయవాడ నగరంలో జరుగుతోంది.

రాయలసీమలో మాత్రం, జగన్ పట్ల సింపతీ పెరిగిందని అంటున్నారు. మిగతా ప్రాంతంలో అయితే, పెద్దగా ఇంపాక్ట్ లేదనే చెప్పాలి. కొన్ని చోట్ల నెగెటివ్ ఇంపాక్ట్ కూడా కనిపిస్తోందిట.