ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీలు, నాయకుల దృష్టి మెగా స్టార్.. చిరంజీవి పై పడింది. ఆయనను మచ్చిక చేసుకునేందుకు నాయకులు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే.. ఆయన ఎవరు వచ్చి ఏం అడిగినా ఓకే.. నేనున్నా
అని చెబుతున్నారు. తాజాగా బీజేపీ అభ్యర్థి, అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి బరిలో ఉన్న సీఎం రమేష్.. హైదరాబాద్లోని నివాసంలో చిరంజీవిని కలుసుకున్నారు. ఇది మర్యాద పూర్వకం కాదని.. తర్వాత ఆయనే ప్రకటించారు. రాజకీయ పరమైన అవసరం కోసమే అన్నయ్యను కలిసినట్టు చెప్పారు.
అనకాపల్లి పార్లమెంటు స్థానంలో గెలిచేందుకు చిరు సాయం కోరినట్టు సీఎం రమేష్ వెల్లడించారు. వాస్తవానికి సీఎం రమేష్ బీజేపీ నాయకుడిగా ఉన్నారు. అయినప్పటికీ.. ఆయన చిరు సాయం కోరడం వెనుక అనకాపల్లి పార్లమెంటు సెగ్మెంట్‌లో రెండు నుంచి మూడు అసెంబ్లీ స్థానాల్లో కాపుల ప్రాబల్యం ఉంది. ఇక్కడ నుంచి ఎవరు గెలిచినా.. కాపుల మద్దతు చాలా అవసరం. ఈ నేపథ్యంలోనే సీఎం రమేష్ చిరంజీవిని కలుసుకున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా మెగా ఫ్యామిలీ అభిమానులు కూడా ఎక్కువగా ఉన్నారు. గతంలోనూ ఇక్కడ ప్రజారాజ్యం బలమైన పోటీ ఇచ్చింది. దీంతో మెగా మద్దతు కోసం రమేష్ స్వయంగా రంగంలోకి దిగి ఉంటారని పరిశీలకులు చెబుతున్నారు.
ఇదిలావుంటే.. చిరంజీవిపై ప్రజర్ పెరిగిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఆయనను కాంగ్రెస్ పార్టీ తమ వాడిగా నే ఇటీవల ప్రకటించింది. చిరంజీవి మా పార్టీలోనే ఉన్నారు. ప్రధాన కార్యదర్శిగా ఆయనకు బాధ్యతలు కూడా ఉన్నాయి. ప్రాథమిక సభ్యత్వం కూడా ఉంది
అని ఏపీకి చెందిన కీలక నాయకుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. అంటే.. కాంగ్రెస్ ఆయనను ఓన్ చేసుకోవడం ద్వారా ఏపీలో ప్రబావం చూపించాలనే వ్యూహంతో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక, జనసేనకు ఇటీవల పవన్ రూ5 కోట్ల వరకు విరాళం ఇచ్చారు. దీంతో మెగా స్టార్ తమకు విరాళం ఇవ్వడమే కాదని.. పిఠాపురం వంటి పవన్ పోటీ చేస్తున్న కీలక నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేయాలన్న డిమాండ్లు ఆ పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. మొత్తంగా.. చిరంజీవిపై పార్టీలకు అతీతంగా నాయకులు ఒత్తిడి పెడుతున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. మరి చిరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి. లేకపోతే.. గత రెండు ఎన్నికల్లో మాదిరిగానే ఆయన తటస్థంగా ఉండిపోతారా అనేది తెలియాల్సి ఉంది.