దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరగనుండగా ఏపీతో పాటు మరో నాలుగు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని ఎంపీ స్థానాలు దక్కించుకుంటుంది అనే విషయంపై పలు మీడియా సంస్థలతో పాటు పలు సర్వే సంస్థలు జోరుగా సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన ఏబీపీ సీ ఓటర్ సర్వే ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమికి పట్టం కట్టింది. మొత్తం 25 లోక్ సభ స్థానాలకు గాను ఏపీలోని ఎన్డీఏ కూటమి 20 స్థానాలను కైవసం చేసుకుంటుందని ఈ సర్వేలో వెల్లడైంది.
అధికార పార్టీ వైసీపీ 5 స్థానాలకు పరిమితం అవుతుందని ఆ సర్వేలో తేలింది. ఎన్డీఏ కూటమికి 47% ఓట్లు, వైసీపీకి 40 శాతం ఓట్లు, కాంగ్రెస్ కు 2 శాతం ఓట్లు, ఇతరులకు 11 శాతం ఓట్లు వస్తాయని తేలింది. గత ఎన్నికల్లో 22 స్థానాలు దక్కించుకున్న వైసీపీ ఈసారి 17 స్థానాలు కోల్పోబోతుందని ఏబీపీ సీ ఓటర్ సర్వేలో తేలింది. అంతేకాదు, ఈ సర్వేతో పాటు మరో 10 సర్వే సంస్థలు కూడా ఏపీలో కూటమి ప్రభంజనం సృష్టించబోతుందని తేల్చి చెప్పాయి. ఇండియా టుడే సర్వేలో కూటమికి 17 సీట్లు రాగా, వైసీపీకి 8 సీట్లు వచ్చాయి.
సీఎన్ఎన్ న్యూస్ సర్వేలో కూటమికి 18 సీట్లు, వైసిపికి 7 సీట్లు…ఇండియా టీవీ సర్వేలో కూటమికి 17 సీట్లు వైసీపీకి 8 సీట్లు, న్యూస్ ఎక్స్ సర్వేలో కూటమికి 18, వైసీపీకి 7, జన్మత్ పోల్స్ సర్వేలో కూటమికి 17, వైసీపీకి 8, స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సర్వేలో కూటమికి 23, వైసీపీకి 2… పీపుల్స్ సర్వేలో కూటమికి 23 వైసీపీకి 2, పయనీర్ పోల్ సర్వేలో కూటమికి 18, వైసీపీకి 7… ఇండియా న్యూస్ సర్వేలో కూటమికి 18, వైసీపీకి 7, జీ న్యూస్ సర్వేలో కూటమికి 17, వైసీపీకి 8 లోక్ సభ స్థానాలు దక్కబోతున్నాయని సర్వేలలో తేలింది. అంటే దాదాపుగా 11 సర్వేలు ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నాయి.