లైవ్‌లో దొరికిపోయిన అంబటి రాంబాబు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతల్లో ఒకరైన అంబటి రాంబాబుకు సంబంధించి మీడియాలో ఉన్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. మహిళలతో సరస సంభాషణలకు సంబంధించిన ఆడియోలతో ఒకటికి రెండుసార్లు ఆయన పేరు మీడియాలో బాగా నానింది. ఇక రాజకీయంగా కూడా తరచుగా ఆయన వ్యాఖ్యలు, వ్యవహారాలు తీవ్ర వివాదాస్పదం అవుతుంటాయి. మీడియా మీద కూడా ఎదురు దాడి చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు.

ఒక ప్రెస్ మీట్లో విలేకరి తాను నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖకు సంబంధించి కీలకమైన ప్రశ్న అడిగితే సమాధానం చెప్పకుండా అతణ్ని బయటికి వెళ్లమనడం మీద కూడా వివాదం నడిచింది. ఇప్పుడిక ఎన్నికల ముంగిట జోరుగా మీడియా చర్చల్లో పాల్గొంటున్నారు అంబటి. ఇందులో భాగంగా ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన మీడియా చర్చా గోష్ఠిలో అంబటి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆడియో లీక్స్ వ్యవహారంతో పాటు అనేక విషయాలు చర్చకు వచ్చాయి. ఆడియోల గురించి అడిగినపుడు సమాధానం దాట వేసిన ఆయన.. సీఎం జగన్ మీద రాయి దాడి విషయంలో ప్రతిపక్షాలను విమర్శించారు. ఐతే ఆ సందర్భంగా ఓ విలేకరి గతంలో చంద్రబాబు మీద రాళ్ల దాడులు జరిగినపుడు మీరు దీనికి భిన్నంగా మాట్లాడారు కదా.. రాళ్ల దాడి చేసినా తప్పు లేదని మాట్లాడారు కదా అని అడిగాడు.

ఐతే అసలు తాను ఎప్పుడు చంద్రబాబు మీద జరిగిన రాళ్ల దాడి గురించి మాట్లాడనే లేదని తేల్చి చెప్పారు అంబటి. ఐతే సదరు విలేకరి వెంటనే తన మొబైల్ తీసి ఇటీవల వైరల్‌గా మారిన అంబటి పాత వీడియోను ప్రదర్శించి చూపారు. ఆ వీడియోలో ఎవరో అసంతృప్తులు ఒక రాయి విసిరితే దాని మీద ఇంత రాద్దాంతం చేస్తారా అంటూ దబాయించారు అంబటి.

ఈ వీడియో చూపించగానే మొదట నీళ్లు నమిలిన అంబటి.. తాను గతంలో ఇది మాట్లాడానని.. ఇప్పుడు చంద్రబాబు మీద జరిగిన రాళ్ల దాడి గురించి అడిగారేమో అనుకుని ఆ మాట అన్నానని.. బాబు అంటే డ్రామాలు చేసేవాడని.. ఆయన గురించి అప్పుడు ఇప్పుడు ఇదే మాట్లాడతానని సంబంధం లేని సమాధానం ఇచ్చి అభాసుపాలయ్యారు అంబటి.