పోటీపై క్లారిటీ లేదు కానీ నామినేష‌న్‌కు సై

సాధార‌ణంగా ఎన్నిక‌లు వ‌చ్చాయంటే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల‌ను పార్టీలు ప్ర‌క‌టిస్తాయి. పోటీ చేసే స్థానం ఖరారైన త‌ర్వాతే నాయ‌కులు నామినేష‌న్‌కు రంగం సిద్ధం చేసుకుంటారు. కానీ ఈ సీనియ‌ర్ నేత మాత్రం ఇంకా పోటీ చేసే స్థానంపై క్లారిటీ రాక‌ముందే నామినేష‌న్ వేసేందుకు రెడీ అవుతున్నారు. అందుకు డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఆ నాయ‌కుడే ర‌ఘురామ కృష్ణ‌రాజు. గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో న‌రసాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన ర‌ఘురామ ఆ త‌ర్వాత రెబ‌ల్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఆయ‌న టీడీపీలో చేరి పోటీకి సిద్ధ‌మ‌వుతున్నారు.

ర‌ఘురామ టీడీపీలో అయితే చేరారు కానీ ఏపీ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తారా? లేదా ఎంపీగా లోక్‌స‌భ ఎన్నిక‌ల బ‌రిలో దిగుతారా? అన్న‌దానిపై ఇంకా స్ప‌ష్టత రాలేదు. కానీ ఆయ‌నేమో ఈ నెల 22న నామినేష‌న్ వేస్తున్నా అని ప్ర‌క‌టించేసుకున్నారు. మ‌రి ఆ నామినేష‌న్ ఎమ్మెల్యే ఎన్నిక‌ల కోసమా? లేదా ఎంపీగా నిల‌బ‌డ‌టానికి అంటే ఆయ‌నే స‌మాధానం ఇవ్వ‌లేక‌పోతున్నారు. ఇంకా ఎటూ తేల్చుకోలేద‌ని, ఏ స్థానంలో పోటీ చేయాల‌న్న దానిపై సందిగ్ధ‌త కొన‌సాగుతుంద‌ని ర‌ఘురామ చెబుతున్నారు.

నిజానికి న‌ర‌సాపురంలోనే ర‌ఘురామ పోటీ చేయాల‌నుకున్నారు. కానీ టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీతో పొత్తులో భాగంగా ఆ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం బీజేపీకి వెళ్లింది. ఆ పార్టీ నుంచి నిల‌బ‌డేందుకు ర‌ఘురామ చేసిన ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌య్యాయి. దీంతో అక్క‌డ బీజేపీ అభ్య‌ర్థిగా శ్రీనివాస్ వ‌ర్మ‌ను ప్ర‌క‌టించారు. దీంతో ర‌ఘురామ టీడీపీలో చేరారు. ఆయ‌న్ని న‌రసాపురంలోనే నిల‌బెట్టేందుకు బాబు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఏలూరు ఎంపీ స్థానాన్ని బీజేపీకి ఇచ్చి.. న‌ర‌సాపురాన్ని తీసుకోవాల‌ని చూస్తున్నారు. కానీ దీనిపై ఇంకా బీజేపీ అధిష్ఠానం నుంచి ఎలాంటి స్పంద‌న రాలేదు.

ఒక‌వేళ అది జ‌ర‌గ‌క‌పోతే ఉండి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ర‌ఘురామ‌ను పోటీ చేయించే ఛాన్స్ ఉంది. కానీ అక్క‌డ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామ‌రాజు ఇప్ప‌టికే ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ర‌ఘురామ ఎక్క‌డి నుంచి ఏ ప‌ద‌వికి పోటీ చేస్తార‌న్న‌ది బీజేపీ తీసుకునే నిర్ణ‌యం మీదే ఆధార‌ప‌డి ఉంది. ఈ రెండు మూడు రోజుల్లో దీనిపై ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశ‌ముంది.