బాలయ్య వచ్చాడు.. కొట్టాడు

నందమూరి బాలకృష్ణ పబ్లిక్‌లోకి వచ్చాడంటే చాలు.. అక్కడ్నుంచి ఒక వార్త కామన్. అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించడం.. వారి మీద బాయల్య చేయి చేసుకోవడం మామూలే. ఇప్పటికే ఇలా చాలాసార్లు జరిగింది. ఇంకో నెల రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో బాలయ్య బస్సు యాత్రకు రెడీ అయ్యారు.

బాలయ్య అన్‌స్టాపబుల్ అని బస్సు మీద రాయించి.. ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ పేరుతో ఆయన ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యారు. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లాలో ఆయన శుక్రవారం తన యాత్రను మొదలుపెట్టారు. రెండో రోజే ఒక అభిమాని మీద చేయి చేసుకోవడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బస్సు యాత్రలో భాగంగా కదిరి ప్రాంతానికి వెళ్లిన బాలయ్యను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. బాలయ్య జనం మధ్య ఉండగా ఒక అభిమాని మీదికి వస్తూ బాలయ్యతో సెల్ఫీ దిగే ప్రయత్నం చేశాడు. దీంతో బాలయ్యకు కోపం కట్టలు తెంచుకుంది. అభిమానిని పక్కకు నెడుతూ చేయి చేసుకున్నాడు. ఇది ప్రత్యర్థులకు ఆయుధంగా మారింది. మరోసారి బాలయ్య దురుసు ప్రవర్తన అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

కానీ అభిమానులు మాత్రం ఎప్పట్లాగే దీన్ని సమర్థిస్తున్నారు. బాలయ్య బౌన్సర్లు, వేరే సెక్యూరిటీ లేకుండా బయటికి వస్తారని.. అభిమానులు అతి చేస్తే వారికి ఇలాగే సమాధానం చెబుతాడని.. ఫ్యాన్స్ కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోరని.. బాలయ్య ఈ విషయాన్ని లైట్ తీసుకోవాలని అంటున్నారు.