వైఎస్ కుటుంబ ప‌రువును రోడ్డున ప‌డేస్తున్నారు..

క‌డ‌ప‌లో కొన్ని ద‌శాబ్దాలుగా పెంచుకున్న వైఎస్ కుటుంబం ప‌రువును ఆ ఇంటి ఆడ‌ప‌డుచులు.. వైఎస్ ష‌ర్మిల‌, సునీత‌లు రోడ్డున ప‌డేస్తున్నార‌ని.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి, వివేకానంద‌రెడ్డిల సోద‌రి వైఎస్ విమ‌లారెడ్డి విమ‌ర్శించారు. వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య విష‌యంపై త‌మ కుటుంబం చింతిస్తూనే ఉన్న‌ద‌న్నారు. అయితే.. దీనిని చిన్న‌వాడైన ఎంపీ అవినాష్‌పైకి నెట్టేసి.. హంత‌కుడు.. హంత‌కుడు అని ప్ర‌చారం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

దీనివ‌ల్ల రాష్ట్రంలో వైసీపీ స‌హా సీఎం జ‌గ‌న్‌పైనా ప్ర‌భావం ప‌డుతోంద‌ని, జ‌గ‌న్ ప్ర‌త్య‌ర్థుల‌తో సునీత‌, ష‌ర్మిల‌లు చేతులు క‌లిపార‌ని విమ‌ల వ్యాఖ్యానించారు. ఒక‌ప్పుడు రాజ‌శేఖ‌ర‌రెడ్డికి ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న‌వారే ఇప్పుడు ష‌ర్మిల‌, సునీత‌ల‌ను ముందుకు న‌డిపిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. వివేకం అన్న‌య్య అంటే.. వారికంటే కూడా నాకు ఎక్కువ ప్రేముంది. న‌న్ను నెత్తిన పెట్టుకుని చూసుకున్నాడు అని విమ‌ల తెలిపారు. ఇప్పుడు లేని పోని వ్యాఖ్య‌ల‌తో వైఎస్ కుటుంబాన్ని రోడ్డున ప‌డేస్తున్నార‌ని అన్నారు.

త‌మ ఇంటి ఆడ‌ప‌డుచులు.. ఇలా మాట్లాడుతుంటే.. విన‌లేక త‌న బీపీ పెరిగిపోతోంద‌ని వ్యాఖ్యానించారు. వివేకం అన్న హ‌త్య కేసులో ఏ ఆధారం ఉంద‌ని వాళ్ల‌క‌న్నా ప‌దేళ్ల చిన్నవాడైన య‌వ్వ‌న‌స్తుడైన అవినాష్‌పై ఇలా మాట్లాడుతున్నారు. హ‌త్య ఎవ‌రు చేశారో.. వీళ్లే డిసైడ్ చేస్తారా? అలాంట‌ప్పుడు.. కోర్టులు ఎందుకు? హ‌త్య చేసిన వాడు బ‌య‌ట స్వేచ్ఛ‌గా తిరుగుతున్నాడు. అత‌ను(వాడు) చెప్పిన మాట‌లు విని అవినాష్‌పై ఇలా నోరు పారేసుకుంటారా? అని విమ‌ల ప్ర‌శ్నించారు.

అవినాష్ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని కోర్టులో పిటిష‌న్‌లు వేశార‌ని, ఈ కేసులోకి జ‌గ‌న్‌ను లాగ‌డం ద్వారా ప్ర‌భుత్వాన్ని ప‌డేయాల‌ని చూస్తున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. వైఎస్ కుటుంబం అంతా ఏక‌తాటిపై ఉంద‌ని ష‌ర్మిల‌, సునీత‌ల వెనుక ఎవ‌రూ లేర‌ని విమ‌ల వ్యాఖ్యానించారు. అస‌లు ఈ కేసులో ఎలాంటి పాపం తెలియ‌ని భాస్క‌ర‌రెడ్డి అన్న‌య్య జైల్లో ఉన్నార‌ని తెలిపారు. సునీత‌, ష‌ర్మిల కార‌ణంగా త‌మ కుటుంబంలో ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంద‌ని తెలిపారు.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌డిపోతే.. రాష్ట్రంలో పేద‌లు అన్యాయం అయిపోతారని విమ‌లారెడ్డి చెప్పారు. తాను స్వ‌యంగా పేద‌లను ప‌రిశీలించాన‌ని.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌.. వారి జీవితాలు మెరుగు ప‌డ్డాయ‌న్నారు. కోవిడ్ స‌మ‌యం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌బుత్వం పేద‌ల‌కు అండ‌గా ఉంటోంద‌ని తెలిపారు. ఇలాంటి ప్ర‌భుత్వం ప‌డిపోవాల‌ని ష‌ర్మిల, సునీత ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలిపారు. ష‌ర్మిల త‌న ప్ర‌చారంలో కొంగు ప‌ట్టుకుని ఓట్లు అడ‌గ‌డం చూశా. ఇలా వైఎస్ ఎప్పుడైనా చేశారా? ఇదేనా నాయ‌క‌త్వ ల‌క్ష‌ణం. నాయ‌క‌త్వ ల‌క్ష‌ణం అంటే.. కొంగు చాపి అడ‌గ‌డ‌మా? అని విమ‌లా రెడ్డి ప్ర‌శ్నించారు.

వారికి మంచి బుద్ధి ప్ర‌సాదించాల‌ని తాను ప్రార్థ‌న‌లు చేస్తున్నాన‌ని చెప్పారు. ఇప్ప‌టికే వైఎస్ కుటుంబంలోని వారంతా వీరికి చెప్పి చూశార‌ని, కానీ వారు సొంత అజెండాలు పెట్టుకుని విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. వీరికి చెప్పి చెప్పి.. విసిగిపోయిన విజ‌య‌మ్మ‌.. అమెరికాకు వెళ్లిపోయార‌ని.. వీరిని ఎవ‌రూ మార్చే ప‌రిస్థితి లేద‌ని, ఆ దేవుడే వీరి మ‌న‌సులు మార్చాల‌ని విమ‌లారెడ్డి వ్యాఖ్యానించారు.