చేతులు కాలాక ఆకులు పట్టుకున్న కేటీఆర్

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన, చాలా చాలా ఆలస్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి తప్పు తెలుసుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఎక్కడుంది.? ఇప్పుడున్నది భారత్ రాష్ట్ర సమితి కదా.? మళ్ళీ ఆ భారత్ రాష్ట్ర సమితి పేరుని, తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చే ఆలోచనలో వున్నట్లు ఇటీవల గులాబీ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించార్లెండి.

అసలు విషయం అది కాదు.! మాజీ మంత్రి, భారత్ రాష్ట్ర సమితి కీలక నేత కల్వకుంట్ల తారక రామారావు, ‘ఓటర్లు తప్పు చేయలేదు.. మేమే కొన్ని తప్పులు చేశాం. తక్కువ ఓట్లతోనే ఎక్కువ సీట్లు ఓడిపోయాం.. అధైర్య పడటంలేదు. మళ్ళీ పుంజుకుంటాం..’ అని సెలవిచ్చారు.

తప్పు తెలుసుకోవడం, ఆత్మ విమర్శ చేసుకోవడం రాజకీయాల్లో చాలా చాలా ముఖ్యం. తప్పుల్ని సరిదిద్దుకుంటేనే ఏ రాజకీయ పార్టీకి అయినా మనుగడ.! ఏ పరిస్థితుల్లో అయినా బౌన్స్ బ్యాక్ అవగల కమిట్మెంట్ గులాబీ పార్టీకి వుంది.

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నిజంగానే చాలా తప్పులు చేసేసింది. పేరు మార్పు, ఆ పార్టీ చేసిన అతి పెద్ద తప్పు. జాతీయ రాజకీయాలంటూ హడావిడి చేయడమూ తప్పే.! అన్నిటికీ మించి, వలస నేతలకు గులాబీ పార్టీలో అవకాశం కల్పించడమూ తప్పే కదా.?

ఇలాంటి తప్పులన్నిటికీ బీఆర్ఎస్ ఇప్పుడు శిక్ష అనుభవిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పుంజుకోవడం అంత తేలిక కాదు.! అదృష్టం కలిసొచ్చి పుంజుకుంటే సరే సరి, లేదంటే తేడాలొచ్చేస్తాయ్.!