నారా లోకేష్ ఐఫోన్ ట్యాప్‌.. నిజ‌మేనా?

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ వినియోగిస్తున్న ఐఫోన్ ట్యాపింగ్‌కు గురైందంటూ.. వార్త‌లు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. ఐఫోన్ కంపెనీ యాపిల్‌… ఈ మేర‌కు ఆయ‌న ఫోన్‌కు సందేశాలు పంపించి న‌ట్టు టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. అదేస‌మ‌యంలో హ్యాకింగ్‌కు కూడా గుర‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని నారా లోకేష్ కు ఫోన్ సందేశాలు అదేవిధం మెయిల్‌కు కూడా సందేశాలు అందాయని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. దీనివెనుక వైసీపీ నేతల హ‌స్తం ఉంద‌ని.. పార్టీ నేత‌లు ఆరోపించారు.

మ‌రి దీనిలో నిజం ఎంత‌?  అనేది ప‌క్క‌న పెడితే.. ఐఫోన్ కంపెనీ యాపిల్ రెండురోజుల కింద‌టే ప్ర‌పంచ వ్యాప్తంగా బ‌హిరంగ ప్ర‌క‌ట‌న జారీ చేసింది. త‌మ కంపెనీ ఫోన్ల‌లో `స్పైవేర్‌` జొర‌బ‌డే అవ‌కాశం ఉంద‌ని.. కాబ‌ట్టి ఫోన్ల‌ను జాగ్ర‌త్త‌గా ఆప‌రేట్ చేయాల‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేసింది. ప్ర‌స్తుతం అమెరికా, భార‌త్ స‌భా ప‌లు దేశాల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఐఫోన్లు వినియోగిస్తున్న సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నేత‌ల‌ను టార్గెట్ చేసుకుని.. స్పైవేర్ సృష్టిక‌ర్త‌ల‌ను ఫోన్ల‌ను హ్యాక్‌, ట్యాపింగ్ చేస్తున్నార‌ని తెలిపింది.

ఈ నేప‌థ్యంలో అన్ని దేశాల‌ను యాపిల్ కంపెనీ అలెర్ట్ చేసింది. మ‌న దేశం విష‌యానికి వ‌స్తే.. త‌మిళ‌నాడులో అధికార పార్టీ డీఎంకే నేత‌లు ఇప్ప‌టిక కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి త‌మ యాపిల్ ఐఫోన్లు ట్యాపింగ్‌కు గుర‌వుతున్నాయ‌ని తెలిపారు. ఇక‌, కేంద్రంలో మంత్రులుగా ఉన్న ఒక‌రిద్ద‌రి  ఫోన్లు(స్మృతి ఇరానీ, రాజ్‌నాథ్ సింగ్) ట్యాప్ అవుతున్నాయ‌ని ఇదే త‌ర‌హా ఫిర్యాదులు ఐటీ శాఖ‌కు తెలిపారు. క‌ర్ణాట‌క‌లో డీకే శివ‌కుమార్ ఫోన్ రెండు నెల‌లుగా ట్యాప్ అవుతోంద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు పేర్కొన్నాయి. అంటే.. మొత్తానికి ఈ స‌మ‌స్య దేశ‌వ్యాప్తంగా ఉంది. ఈ నేప‌థ్యంలో వైసీపీ నేత‌లే చేశారా?  చేయించారా? అనేది రాజ‌కీయ వివాద‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.