జ‌గ‌న్‌కు స‌వాలుగా నెల్లూరు

ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాలో వైసీపీకి తిరుగులేని రికార్డుంది. ఏపీ విభ‌జ‌న త‌ర్వాత జ‌రిగిన రెండు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ మెరుగైన ఫ‌లితాలు సాధించింది. కానీ ఈ సారి మాత్రం జ‌గ‌న్‌కు స‌వాలు త‌ప్ప‌ద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. జ‌గ‌న్ పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త.. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మికి అనుకూలంగా మారుతుంద‌నే అభిప్రాయాలున్నాయి. దీంతో ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాలోని ప‌ది అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో మెజారిటీ స్థానాలు కూట‌మి ఖాతాలోకి చేరేలా ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.

2014లో టీడీపీ కూట‌మి అధికారంలోకి వ‌చ్చినప్ప‌టికీ నెల్లూరులో మాత్రం 10 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ ఏడు చోట్ల గెల‌వ‌డం విశేషం. టీడీపీ కేవ‌లం ఉద‌య‌గిరి, వెంక‌ట‌గిరి, కోవూరు నియోజ‌క‌వ‌ర్గాల‌కే ప‌రిమిత‌మైంది. నెల్లూరు సిటీ, నెల్లూరు రూర‌ల్‌, ఆత్మ‌కూరు, కావ‌లి, గూడురు, స‌ర్వేప‌ల్లి, సూళ్లూరుపేట‌లో వైసీపీ జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. ఇక 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ వేవ్‌తో వైసీపీ ప‌దికి ప‌ది స్థానాలు క్లీన్‌స్వీప్ చేసింది. కానీ అయిదేళ్ల‌లో ప‌రిస్థితులు మారిపోయాయి. ఈ సారి నెల్లూరులో అంత ఈజీ కాద‌ని తెలిసే జ‌గ‌న్ ఇక్క‌డ ప్ర‌తి సీటు గెల‌వాల‌నే ల‌క్ష్యంతో ప్ర‌త్యేకంగా స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు.

నెల్లూరు సిటీలో సిటింగ్ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌పై వ్య‌తిరేక‌త కార‌ణంగా ఖ‌లీల్ అహ్మ‌ద్‌ను జ‌గ‌న్ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు. ఇక్క‌డ టీడీపీ నుంచి మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ బ‌రిలో ఉన్నారు. ఇక్క‌డ నారాయ‌ణ విజ‌యం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. మ‌రోవైపు వైసీపీకి గ‌తంలో ఆర్థికంగా అండ‌గా నిలిచిన నెల్లూరు ఎంపీ అభ్య‌ర్థి వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి స‌తీస‌మేతంగా టీడీపీలోకి వెళ్లిపోయారు. ఇది వైసీపీపై తీవ్ర ప్ర‌భావం చూప‌నుంద‌నే చెప్పాలి. ఇక నెల్లూరు రూర‌ల్‌లో రెండు సార్లు వైసీపీ నుంచి గెలిచిన కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి ఇప్పుడు టీడీపీ నుంచి బ‌రిలో ఉన్నారు. ఇక ఆత్మ‌కూరు, కావ‌లి, గూడురు.. ఇలా వేరే నియోజ‌క‌వ‌ర్గాలు చూసుకున్నా కూట‌మికి అనుకూల‌ ప‌రిస్థితులున్నాయ‌ని టాక్‌. అందుకే జ‌గ‌న్ ఇక్క‌డ క‌నీసం అయిదు స్థానాలైనా గెల‌వాల‌ని నాయ‌కుల‌కు తేల్చిచెప్పార‌ని తెలిసింది.