కేవలం డబ్బు సాయమేనా లేక మాట సాయం కూడానా

Pawan Kalyan

మెగాస్టార్ చిరంజీవి, జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయల విరాళం ప్రకటించడం టాక్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్‌గా మారింది.! ఇందులో నిజానికి వింతేమీ లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే, స్వయానా మెగాస్టార్ చిరంజీవికి సోదరుడే కదా.! తమ్ముడి పార్టీకి అన్నయ్య ఆర్థిక సాయం చేయడం అంత ప్రత్యేకమైన విషయమేమీ కాదు.

కాకపోతే, టైమింగ్.! సరిగ్గా ఎన్నికల సమయంలో మెగాస్టార్ చిరంజీవి, జనసేన పార్టీకి విరాళం ప్రకటించడమే సంచలనం. కేవలం సంచలనం మాత్రమే కాదు, వ్యూహాత్మకం కూడా.! దీన్నొక స్టేట్మెంట్‌గా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘నా తమ్ముడి వెంట నేనున్నాను..’ అనే స్టేట్మెంట్ చిరంజీవి ఇచ్చారన్నది అంతటా వినిపిస్తున్న వాదన.

అయితే, మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ నిస్వార్దంగా చేస్తున్న ప్రజా సేవ, మరీ ముఖ్యంగా కౌలు రైతుల కుటుంబాలకు అందిస్తున్న సాయం గురించి ట్విట్టర్ వేదికగా ప్రస్తావిస్తూ, ఆ సాయానికి తాను అందిస్తున్న సాయం.. అని చిరంజీవి పేర్కొనడం ఆసక్తికరమైన విషయం.

ఇదిలా వుంటే, మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారంటూ ఓ వార్త సినీ, రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. రాష్ట్రంలో జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాలన్నిటిలోనూ కాదుగానీ, ఒకట్రెండు నియోజకవర్గాల్లో చిరంజీవి ఎన్నికల ప్రచారం చేసే అవకాశం వుందట.

కాదు కాదు, కేవలం పిఠాపురం నియోజకవర్గానికే చిరంజీవి ప్రచారం పరిమితమవుతుందనీ అంటున్నారు. అయితే, చిరంజీవి ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. రాజకీయాల నుంచి వైదొలగినట్లు గతంలోనే ప్రకటించారు. కానీ, తమ్ముడి కోసం.. పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేసేందుకు చిరంజీవి ఏ క్షణాన అయినా కీలక నిర్ణయం తీసుకోవచ్చు.