హ్యాట్రిక్‌పై బాల‌య్య గురి.. ఇప్ప‌టికే వైసీపీ డౌన్‌!

హిందూపురంలో నంద‌మూరి బాల‌కృష్ణ‌కు తిరుగు లేదు.. ఈ సారి ఆయ‌న హ్యాట్రిక్ కొట్టడం ప‌క్కా.. ఇది ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారిన టాపిక్‌. అధికార వైసీపీ ఏం చేసినా బాల‌య్య‌ను మాత్రం ఓడించ‌లేద‌నే అభిప్రాయాలు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. అందుకే వ‌రుస‌గా మూడో సారి గెలిచేందుకు బాల‌య్య రంగం సిద్ధం చేసుకుంటున్నార‌నే చెప్పాలి. హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం అంటే టీడీపీకి కంచు కోట‌. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్క‌డ ఓడిపోయిన చ‌రిత్రే లేదు. ఇక్క‌డ ఆ పార్టీకి ఉన్న బ‌లం అలాంటిది.

2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ భారీ విజ‌యం సాధించిన బాల‌య్య‌.. 2019లోనూ అద‌ర‌గొట్టారు. జ‌గ‌న్ వేవ్‌ను దాటి మ‌రీ హిందూపురంలో ఘ‌న విజ‌యం సాధించారు. ఈ సారి కూడా ఆయ‌న విజ‌యంపై ధీమాతో ఉన్నారు. త్వ‌ర‌లోనే ప్ర‌చారాన్ని హోరెత్తించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే ఈ సారి బాల‌య్య‌కు చెక్ పెట్టేందుకు వైసీపీ అన్ని ప్ర‌య‌త్నాలూ చేస్తోంద‌నే చెప్పాలి. అయితే అక్క‌డి వైసీపీలో అసంతృప్తితో పార్టీకి షాక్ త‌ప్పేలా లేదు. హిందూపురంలో బాల‌య్య‌ను ఓడించే టాస్క్‌ను మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి జ‌గ‌న్ అప్ప‌గించారు. ఈ సారి అక్క‌డ అభ్య‌ర్థిని వైసీపీ మార్చింది. హిందూపురానికి సంబంధం లేని దీపికారెడ్డికి టికెట్ కేటాయించింది.

దీపికారెడ్డికి టికెట్ ఇవ్వ‌డం ప‌ట్ల హిందూపురంలోని వైసీపీ నాయ‌కులు భ‌గ్గుమ‌న్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఇక్బాల్ టీడీపీలోకి వెళ్లిపోయారు. ఇక ఇత‌ర వైసీపీ నాయ‌కుల్లో ఒక‌రంటే మ‌రొక‌రికి ప‌డ‌టం లేదు. ఈ నేప‌థ్యంలో దీపిక‌రెడ్డికి క‌ఠిన స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయ‌నే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. దీంతో పెద్దిరెడ్డి ఎంత‌గా క‌ష్ట‌ప‌డ్డా, ఖ‌ర్చు పెట్టినా ఫ‌లితం మాత్రం ఉండ‌ద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ సారి బాల‌య్య హ్యాట్రిక్ విజ‌యం సాధించ‌డ‌మే కాదు మ‌రింత మెజారిటీ ద‌క్కించుకుంటార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.