ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాలు వ‌దిలి.. ఒక్క‌టిగా క‌దిలి

రాయ‌ల‌సీమ‌లోని ఆళ్ల‌గ‌డ్డ‌లో ద‌శాబ్దాలుగా రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న రెండు కుటుంబాలు క‌లిశాయి. ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ అభ్య‌ర్థి గెలుపు కోసం క‌లిసి ప‌నిచేసేందుకు సిద్ధ‌మ‌య్యాయి. నంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డలో రాజ‌కీయం అంటే భూమా కుటుంబం పేరే వినిపిస్తోంది. కానీ వీళ్ల‌కు ప్ర‌త్య‌ర్థిగా ఇరిగెల కుటుంబం కూడా ఉండేది. కానీ ఇప్పుడు భూమా, ఇరిగెల వ‌ర్గాలు క‌లిసిపోయాయి. ఆళ్ల‌గ‌డ్డ‌లో భూమా అఖిల ప్రియ‌ను గెలిపించేందుకు సిద్ధ‌మయ్యాయి.

ఆళ్ల‌గ‌డ్డ‌లో గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా ఈ రెండు వ‌ర్గాల మ‌ధ్య ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాలు న‌డిచాయి. దాడులు కూడా చేసుకున్నార‌నే చెబుతారు. 1991లో ఆళ్ల‌గ‌డ్డ అసెంబ్లీ ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన భూమా నాగిరెడ్డికి ఇరిగెల వ‌ర్గం మ‌ద్ద‌తిచ్చింది. కానీ ఆ త‌ర్వాత రాజ‌కీయ విభేదాల కార‌ణంగా వీళ్లు విడిపోయారు. అప్ప‌టి నుంచి భూమా కుటుంబానికి వ్య‌తిరేకంగా ఇరిగెల రాంపుల్లారెడ్డి మూడు సార్లు పోటీ చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి ఆ కుటుంబం మ‌ద్ద‌తునిచ్చింది.

కానీ గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత వైసీపీకి ఇరిగెల కుటుంబం దూరమ‌య్యారు. ఈ నేప‌థ్యంలోనే ఇరిగెల బ్ర‌ద‌ర్స్ జ‌న‌సేన‌లో చేరారు. ఆళ్ల‌గ‌డ్డ టికెట్ కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నాలు కూడా చేశారు. కానీ పొత్తులో భాగంగా ఆళ్ల‌గ‌డ్డ టికెట్ భూమా అఖిల‌ప్రియ‌కే ద‌క్కింది. టీడీపీ త‌ర‌పున పోటీ చేసేందుకు ఆమె సిద్ధ‌మ‌య్యారు. దీంతో పొత్తు ధ‌ర్మంలో భాగంగా భూమా అఖిల ప్రియ‌కు మ‌ద్ద‌తుగా నిలిచేందుకు ఇరిగెల వ‌ర్గం ముందుకొచ్చింది. ఈ రెండు కుటుంబాల‌ను క‌ల‌ప‌డంలో బైరెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కీల‌క పాత్ర పోషించారని తెలిసింది. ఏదైతేనేం 33 ఏళ్ల త‌ర్వాత భూమా, ఇరిగెల కుటుంబాలు క‌లిశాయ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అఖిల ప్రియ విజయం కోసం ప‌ని చేస్తామ‌ని, నంద్యాల పార్లమెంటు స్థానంలో టీడీపీ అభ్య‌ర్థి బైరెడ్డి శ‌బ‌రిని గెలిపించుకుంటామ‌ని రాంపుల్లారెడ్డి చెప్ప‌డం విశేషం.