వలంటీర్లు-సూప‌ర్ సిక్స్‌-సీఎం జ‌గ‌న్‌

కూట‌మి పార్టీలైన బీజేపీ-జ‌న‌సేన‌-టీడీపీ ప‌క్షాన తొలిసారి జ‌రిగిన ఉమ్మ‌డి స‌భ‌లో చంద్ర‌బాబు మూడు కీల‌క అంశాల‌ను ప్ర‌స్తావించారు. ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని త‌ణుకులో నిర్వ‌హించిన ఈ ఉమ్మ‌డి స‌భ‌లో ఈ మూడు అంశాల‌నే ప‌దే ప‌దే చంద్బ‌రాబు ప్ర‌స్తావించారు. సుమారు 55 నిమిషాల‌పైనే మాట్లాడిన చంద్ర‌బాబు ఈమూడు అంశాల చుట్టూనే త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగించారు. 1) వ‌లంటీర్లు, 2) సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలు, 3) సీఎం జ‌గ‌న్‌. వీటిని బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లే ప్ర‌య‌త్నం చేశారు.

1) వ‌లంటీర్లు: చంద్ర‌బాబు గ‌త నాలుగు రోజులుగా వ‌లంటీర్ల అంశాన్ని ప్ర‌తిచోటా ప్ర‌స్తావిస్తున్నారు. చివ‌ర‌కు ఉగాది పంచాంగ ప‌ఠ‌నం కార్య‌క్ర‌మంలోనూ వ‌లంటీర్ల‌కు వ‌రాలు ప్ర‌క‌టించారు. తాము అధికారంలోకి రాగానే వారి వేత‌నాన్ని రూ.5 వేల నుంచి రూ.10ల‌కు పెంచుతామ‌న్నారు. అదేవిధంగా వారిని కొన‌సాగిస్తామ‌ని చెప్పారు. ప్ర‌స్తుత వైసీపీ ప్ర‌భుత్వం రాజ‌నామాలు చేయాల‌ని బ‌ల‌వంతం చేస్తున్నా.. చేయొద్ద‌ని చెప్పారు. ఇక‌, తాజాగా త‌ణుకు స‌భ‌లోనూ ఇదే చెప్పారు. దీనికితోడు రూ.10 వేలు కాదు.. వ‌లంటీర్ల‌కు స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్‌లో శిక్ష‌ణ ఇచ్చి రూ.ల‌క్ష సంపాయించుకునే అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని చెప్పారు.

2) సూప‌ర్ సిక్స్‌: గ‌త మ‌హానాడులో ప్ర‌క‌టించిన ఈ ఆరు ప‌థ‌కాల‌ను చంద్ర‌బాబు ప‌దే ప‌దే గుర్తు చేస్తున్నారు. మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం… తల్లికి వంద‌నం పేరుతో రూ.15000 చొప్పున ఎంత మంది పిల్ల‌లు ఉంటే అంద‌రికీ నిధులు. ఇంట్లో 18 ఏళ్లు నిండిన వారి నుంచి ఎంంత వ‌య‌సుంటే అంద‌రికీ రూ.1500 చొప్పున స్త్రీనిధి, యువ‌త‌కు 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇస్తామ‌ని చెబుతున్నారు. రైతుల‌కు ఏడాదికి 20 వేల ఆర్థిక సాయం, ప్ర‌తి ఇంటికీ ఉచితంగా మూడు సిలిండ‌ర్లు.. ప్ర‌క‌టించారు. తాజాగా దీనినే మ‌రోసారి ప్ర‌క‌టించారు. అయితే.. ఈ సారి మ‌రింత వివ‌ర‌ణాత్మ‌కంగా వాటిని ప్ర‌జ‌ల‌కు తెలిపారు.

3) సీఎంజ‌గ‌న్‌: ఇది ఎప్పుడూ చంద్ర‌బాబు ప్ర‌స్తావించే అంశ‌మే అయినా.. ఈసారి త‌ణుకు స‌భ‌లో మ‌రింత లోతుగా సీఎం జ‌గ‌న్‌ను ఆయ‌న విమ‌ర్శించారు. యూట్యూబ్ రీల్స్‌, షార్ట్ ఫిలిమ్స్‌తో వైసీపీచేస్తున్న ఆన్‌లైన్ ప్ర‌చారంపై చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో స్పందించారు. వాటిని న‌మ్మ‌ద్ద‌ని ఆయ‌న సూచించారు. ఇక‌, సీఎం జ‌గ‌న్ చేసింది ఏమీలేద‌న్నారు. ఆయ‌న వ‌ల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమీలేద‌న్నారు. ప‌ర‌దాలు క‌ట్టుకుని వ‌స్తున్నాడ‌ని ఎద్దేవా చేశారు. అయితే.. ఈ సారి చెల్లెలు ష‌ర్మిల‌, సునీత‌, వివేకా హ‌త్య‌ల వంటి విష‌యాల‌ను ప్ర‌స్తావించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం.