విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి సుజనా చౌదరి గెలుస్తారా.? గెలవరా.? టీడీపీ – జనసేన – బీజేపీ పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గం బీజేపీ కోటాలోకి వెళ్ళింది. మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఈ టిక్కెట్ దక్కించుకున్నారు.. అనూహ్యంగా.
జాతీయ రాజకీయాల్లో బిజీగా వుండే సుజనా చౌదరి, రాష్ట్ర రాజకీయాల్లో.. అందునా, అసెంబ్లీకి పోటీ చేయనుండడం ఆసక్తికరమే. ఆయన, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితుడు. ఏదో ఒక లోక్ సభ నియోజకవర్గం నుంచి సుజనా చౌదరి పోటీ చేస్తారన్న ప్రచారం తొలుత జరిగింది.
విజయవాడ వెస్ట్ టిక్కెట్ కన్ఫామ్ అయ్యాక, సుజనా చౌదరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇదెందుకో, పోతిన మహేష్‌కి నచ్చలేదు. అప్పటినుంచీ ఆయన వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. జనసేనలో అంతర్యుద్ధానికి తెరలేపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలిపించుకుని మాట్లాడినా ప్రయోజనం లేకుండా పోయింది.
పోతిన మహేష్ జనసేన పార్టీని వీడి, వైసీపీలో చేరిపోయారు. ఇక్కడే విజయవాడ వెస్ట్ ఈక్వేషన్ అనూహ్యంగా మారింది. ఒక్కసారిగా జనసైనికులు సుజనా చౌదరి పట్ల సానుకూలతను ప్రదర్శించడం మొదలు పెట్టారు. ఇదంతా, పోతిన మహేష్ మీద ఏర్పడ్డ అసహనం తాలూకు ఫలితమే.
పోతిన మహేష్ గనుక జనసేన పార్టీని వీడకుండా వుండి వుంటే, విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో బీజేపీకి పడాల్సిన జనసేన ఓట్లలో ఎంతో కొంత కోత పడి వుండేదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు.
వాస్తవానికి, సుజనా చౌదరి కూడా ఈ పరిస్థితిని ఊహించలేదట.! అందుకే, జనసైనికుల్ని మరింతగా కలుపుకుపోయేలా సరికొత్త రాజకీయ కార్యాచరణను సుజనా చౌదరి అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates