ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే ముస్లింలకు వర్తిస్తున్న 4 శాతం రిజర్వేషన్లను ఎత్తివేస్తామని, అందుకు చంద్రబాబు, పవన్ కూడా అంగీకరించారని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆల్రెడీ బీజేపీ అగ్రనేత అమిత్ షా కూడా ఈ తరహా వ్యాఖ్యలు అధికారికంగా చేయడంతో నిజంగానే పురంధేశ్వరి ఆ వ్యాఖ్యలు చేశారని చాలామంది భావించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై పురంధేశ్వరి క్లారిటీనిచ్చారు. ఆ వార్తలను నమ్మవద్దని ముస్లింలకు పురంధేశ్వరి విజ్ఞప్తి చేశారు.
‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అనేది బీజేపీ నినాదమని, ముస్లిం రిజర్వేషన్లపై తాను మాట్లాడినట్టు వైరల్ అవుతున్నది ఫేక్ వార్త అని, దానిని నమ్మవద్దని కోరారు. రాజమండ్రిలో పురందేశ్వరికి లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక పెయిడ్ ఆర్టిస్టులతో వైసీపీ దుష్ప్రచారం చేయిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు.
కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తణుకులో నిర్వహించనున్న ఉమ్మడి ప్రచారంలో పురంధేశ్వరి కూడా పాల్గొనే అవకాశముందని తెలుస్తోంది. సాయంత్రం 4 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో, సాయంత్రం 7 గంటలకు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించే బహిరంగసభల్లో పవన్, బాబు పాల్గొంటారు. నిడదవోలు సభలో పురంధేశ్వరి కూడా పాల్గొనే అవకాశం ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates