జనసేన పార్టీకి చెందిన కీలక నేత పోతిన మహేష్ 2 రోజుల క్రితం జనసేన పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన మహేష్ కు నిరాశ తప్పులేదు. పొత్తులో భాగంగా బిజెపి నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు సీఎం రమేష్ కు ఆ సీటు దక్కింది. అయితే మహేష్ ను స్వయంగా పవన్ కళ్యాణ్ బుజ్జగించేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. తనకు టికెట్ దక్కకపోవడంతో పార్టీని వీడుతూ పవన్ కళ్యాణ్ పై మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మహేష్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో మహేష్ తో పాటు ఆయన అనుచరులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడు ఎవరు అందరికీ తెలుసు అంటూ రెండు రోజులు క్రితం మహేష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. పరోక్షంగా సీఎం జగన్ ను ఉద్దేశించి మహేష్ ఆ వ్యాఖ్యలు చేయడంతో ఆయన వైసీపీలో చేరుతారని టాక్ వచ్చింది. వైసీపీలో చేరితే తప్పేంటి అని ప్రశ్నించిన మహేష్..తాను వైసీపీ నుంచి ఒక్క పైసా తీసుకున్నట్లు నిరూపించగలరా అని సవాల్ విసిరారు.
అంతకుముందు, పవన్ కళ్యాణ్ పై మహేష్ సంచలన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. నాయకుడంటే భరోసా ఇచ్చేవాడని, భవిష్యత్తుకు భద్రత కల్పించేవాడని, కానీ, పవన్ కు సొంత పార్టీ జెండా కన్నా పక్క పార్టీల జెండాలు మోయడంపైనే ఆసక్తి ఎక్కువని మహేష్ విమర్శించారు. పవన్ కళ్యాణ్ ను నమ్ముకుని నట్టేట మునిగామని, ఇన్నాళ్లు ఆయనతో కలిసి నడిచినందుకు అసహ్యంగా ఉందని మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వార్ధపరులతో ప్రయాణించామని ఆలస్యంగా తెలుసుకున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పవన్ పార్టీ పెట్టినట్టుగా తన దగ్గర ఆధారాలున్నాయని, వాటిని బయట పెడతానని మహేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. రాజకీయాల్లోకి వచ్చి తాము ఆస్తులు అమ్ముకున్నామని, పవన్ మాత్రం వెనకేసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కాపు సామాజిక వర్గానికి, తమవంటి కొత్త తరం రాజకీయ నాయకులకు పవన్ సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. పక్క పార్టీల జెండాలు మోయడానికే జనసేన నేతలు, కార్యకర్తలు ఉన్నారా అని ప్రశ్నించారు. సీట్ల త్యాగాలకు మాత్రం బీసీలు కావాలి…కమ్మ సామాజిక వర్గం నేతలు పనికిరారా అని మహేష్ ప్రశ్నించారు. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ సీటు త్యాగం చేయొచ్చు కదా అని నిలదీశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates