ష‌ర్మిల వెనుక రేవంత్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల దూకుడు చూపిస్తున్నారు. న్యాయ యాత్ర పేరుతో బ‌స్సులో ప‌ర్య‌టిస్తున్న ఆమె ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నారు. క‌డ‌ప లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీసీ సిటింగ్ ఎంపీ అవినాష్ రెడ్డిపై విజ‌యమే ల‌క్ష్యంగా పోరాడుతున్నారు. ముఖ్యంగా చిన్నాన్న వివేకానంద రెడ్డి హ‌త్య విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి మ‌రింత‌గా తీసుకెళుతూ.. అవినాష్‌, సీఎం జ‌గ‌న్‌పై ష‌ర్మిల తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే ష‌ర్మిల జోరు వెనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హ‌స్తం ఉంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

తెలంగాణ ఎన్నిక‌ల్లో పీసీసీ అధ్య‌క్షుడిగా ఎంతో క‌ష్ట‌ప‌డ్డ రేవంత్ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు సీఎంగా సాగుతున్నారు. ఇప్పుడు ఏపీలోనూ కాంగ్రెస్ పుంజుకునేలా, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపేలా ష‌ర్మిల‌తో రేవంత్ మంత‌నాలు జ‌రుపుతున్న‌ట్లు టాక్‌. ఏపీ పీసీసీ అధ్య‌క్షురాలిగా ష‌ర్మిల బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి వైసీసీ అధినేత, సీఎం జ‌గ‌న్‌ను ల‌క్ష్యంగా చేసుకుని సాగుతున్నారు. త‌న అన్న అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ చేసిందేమీ లేదంటూ ఆమె తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ముఖ్యంగా వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో అవినాష్‌ను కాపాడుతున్న జ‌గ‌న్ వైఖ‌రిని ష‌ర్మిల ఎండ‌గ‌డుతున్నారు. హత్య వెనుక ఉన్న‌ది అవినాష్ అంటూ, అండ‌గా నిలుస్తోంది జ‌గ‌న్ అని ష‌ర్మిల తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. అయితే ష‌ర్మిల అనుస‌రించాల్సిన వ్యూహాలు, ప్ర‌ణాళిక‌ల్లోనూ రేవంత్ పాత్ర ఉంద‌ని తెలుస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడూ ష‌ర్మిల‌కు రేవంత్ సూచ‌న‌లు ఇస్తున్న‌ట్లు టాక్‌. మ‌రి ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఏ మేర‌కు ప్ర‌భావం చూపుతుందో చూడాలి.