అర్థరాత్రి వేళ క్రోసూరులో టీడీపీ ఆఫీసుకు నిప్పు

ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. ఇప్పటివరకు జరిగిన ఎన్నికలకు భిన్నంగా తాజా ఎన్నికలు జరుగుతున్నాయి. నువ్వా నేనా? అన్న రీతిలో జరుగుతున్న ఈ ఎన్నికలు అధికార.. విపక్షానికి అత్యంత కీలకమైనవి కావటంతో రెండు పక్షాలు ఎక్కడా తగ్గని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే తాజాగా పల్నాడు జిల్లాలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది.

ఆదివారం అర్థరాత్రి వేళ క్రోసూరులో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో.. ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పది రోజుల కిందటే క్రోసూరు నాలుగురోడ్ల కూడలిలో (మన్నెం భూషయ్య కాంప్లెక్స్ లో) తెలుగుదేశం పార్టీ ఆఫీసును ఓపెన్ చేశారు. కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ చేతుల మీదుగా ఓపెన్ అయిన ఈ పార్టీ ఆఫీసును గుర్తు తెలియని వారు నిప్పు పెట్టటం.. దాన్ని చలువ పందిరి కావటంతో నిమిషాల్లో ఆగ్నికి ఆహుతి అయ్యింది.

పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టిన విషయం క్షణాల్లో వైరల్ గా మారింది. కూటమి నేతలు.. కార్యకర్తలు.. సానుభూతిపరులు.. మద్దతుదారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని ఆపే ప్రయత్నం చేశారు కానీ.. తీవ్రత ఎక్కువగా ఉండటంతో సాధ్యం కాలేదు. పెద్ద ఎత్తున మంటలు రేగటంతో చుట్టుపక్కల వారు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు దగ్గర్లోని ఫైరింజన్ ఉన్నప్పటికీ అక్కడకు రావటంలో ఆలస్యం కావటంపై నిరసన వ్యక్తమైంది.

శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన ప్రజాగళం సభ సక్సెస్ కావటంతో ఓర్వలేక నిప్పు పెట్టినట్లుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో అధికార పార్టీకి సంబంధం ఉందని.. వారికి సంబంధించిన వారే చేసి ఉంటారని విరుచుకుపడుతున్నారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ అర్థరాత్రి వేళ ఆందోళనకు దిగారు. పార్టీ కార్యాలయాన్ని నిప్పు పెట్టిన ఉదంతం గురించి సమాచారం అందుకున్న కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధ్యుల్ని గుర్తించి.. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఉదంతం అక్కడి వాతావరణాన్నిమరింత ఉద్రిక్తంగా మార్చింది.