జన జాతర క్రెడిట్ మొత్తం రేవంత్ ఖాతాలోకి!

అదృష్టవంతుడ్ని ఆపలేరంటారు. దురదృష్టవంతుడ్నిమార్చలేరంటారు. ఈ మాట నిజంగానే నిజం. తాజాగా తెలంగాణ రాజకీయాల్ని చూసినప్పుడు.. అందునా ముఖ్యమంత్రి రేవంత్ ను చూస్తే.. ఇప్పుడాయన కాలం దివ్యంగా ఉంది. తన జీవితంలోనే అత్యంత పీక్స్ లో ఉన్న ఆయన.. దేన్ని టచ్ చేసినా బంగారమే అవుతోందన్నట్లుగా ఉంది. మండే ఎండలు.. ఉక్కిరిబిక్కిరి చేసే వాతావరణంలో ఒక భారీ బహిరంగ సభ. అందునా.. ఆ సభా వేదికకు చుట్టుపక్కల ఉండే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేనప్పటికీ.. భారీగా జనాల్ని సమీకరించటం అంటే మాటలా? అందునా.. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ ఎక్కడకు వెళ్లినా చూడనంత జనం జాతర మాదిరి పార్టీ సభకు పోటెత్తితే అంతకు మించిన సంతోషం ఇంకేం ఉంటుంది.

తాజాగా తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర సభ సక్సెస్ కావటమే కాదు.. అనూహ్యంగా పార్టీ అనుకున్న దానికి మించి జనం ఈ సభకు రావటంతో రాహుల్ అండ్ కో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యిందని చెప్పాలి. ఈ సభ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ మాత్రమే కాదు.. ఆ పార్టీకి చెందిన అగ్రనేతలంతా కూడా ఎవరి స్థాయిలో వారు కష్టపడ్డారు. సభను సక్సెస్ చేసేందుకు అహరహం శ్రమించారు. వారి శ్రమకు తగ్గట్లే.. ఫలితాన్ని సొంతం చేసుకున్నారు.

సభకు వచ్చిన భారీ జన సందోహాన్ని చూసిన రాహుల్ ఒకింత ఆశ్చర్యానికి గురి కావటమే కాదు.. తన సంతోషాన్ని తన స్పీచ్ లో చెప్పేశారు. ఇక్కడే ఒక ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. జనజాతర సభ సూపర్ సక్సెస్ అయిన వేళ.. దానికి సంబంధించిన క్రెడిట్ మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ ఖాతాలోకి వెళ్లటం ఆసక్తికరంగా మారింది. అయితే.. ఈ సక్సెస్ మొత్తం తన ఒక్కడిది కాదన్నట్లుగా రేవంత్ తీరు ఉండటం గమనార్హం.

సీఎం హోదాలో మాట్లాడే క్రమంలో.. పార్టీకి చెందిన ముఖ్యనేతల పేర్లను.. వారి ప్రస్తావనను తీసుకురావటం ద్వారా రేవంత్ ప్రదర్శించిన చతురతను చూస్తే మాత్రం ఫిదా కావాల్సిందే. ఎక్కడా ఎలాంటి గ్యాప్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న ఆయనకు.. మైలేజే.. మైలేజీ అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయని చెప్పాలి. రేవంత్ రాజకీయ ప్రత్యర్థులు ఆయన్ను మహా సుడిగాడంటూ వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. వాస్తవం చూస్తే.. సుడి అనే విషయంలో ఆయన వ్యవహారశైలే అలా చేస్తుందన్నది మాత్రం మర్చిపోకూడదు.