కేంద్రంలో ఏర్పడే ఏ ప్రభుత్వాన్నయినా.. అంతో ఇంతో ప్రభావితం చేయగలిగితే.. అది తమకు మాత్రమే కాదని.. ఆ ప్రయోజనం ఏపీకి, ఏపీ ప్రజలకు దక్కుతుందని వైసీపీ అధినేత జగన్ పదే పదే చెబుతున్నారు. అయితే.. గత ఐదేళ్ల కాలంలో ఇలాంటి ప్రయత్నం చేసింది లేదు. కానీ.. ఇప్పుడు మరోసారి వైసీపీకి భారీ అవకాశమే దక్కింది. కేంద్రంలో వైసీపీ పరపతి మరింత పెరిగింది. ప్రస్తుతం 9 మంది మాత్రమే ఉన్న రాజ్యసభ బలం 11కి చేరింది.
తాజాగా కొత్తగా ఎన్నికైన ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ్ రెడ్డిలతో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్కడ్ ప్రమాణం చేయించారు. వీరిలో వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి ఇంగ్లీష్ లో ప్రమాణం చేయగా.. గొల్ల బాబూ రావు హిందీలో ప్రమాణం చేశారు. కొత్త సభ్యులతో కలిపి ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీ సభ్యుల సంఖ్య 11కు చేరుకుంది. ఈ క్రమంలో రాజ్యసభలో నాలుగో పెద్ద పార్టీగా వైసీపీ అవతరించింది.
రాజ్యసభలో 97 మంది సభ్యులతో బీజేపీ అగ్ర స్థానంలో ఉండగా… 29 మంది సభ్యులతో కాంగ్రెస్, 13 మంది సభ్యులతో టీఎంసీ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక, ఇప్పుడు రాజ్యసభలో 11 మంది సభ్యులతో వైసీపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. దీంతో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా.. వైసీపీ మద్దతు అవసరం అవుతుంది. వైసీపీ మద్దతు లేకుండా.. అడుగులు ముందుకు వేసే పరిస్థితి కూడా రాకపోవచ్చు. మరి ఈ నేపథ్యంలో వైసీపీ తనకు దక్కిన ఈ పరపతిని రాష్ట్రానికి ఏమేరకు ఉపయోగపడేలా చేస్తారు? అనేది చూడాలి.
రాష్ట్రం అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వస్తేనే పట్టించుకుం టామని చెప్పి చేతులు దులుపుకొంటారా? లేక.. ప్రజా ప్రయోజనమే గీటురాయిగా .. పెద్దల సభలో పనిచేస్తారా? అనేది వేచి చూడాలి. ఇప్పటి వరకు అయితే.. ఈ తరహాలో వైసీపీ పనిచేయలేదనే విమర్శలు ఉండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates