క‌డ‌ప స‌హా మూడు చోట్ల హోరా హోరీ..: కాంగ్రెస్ లిస్ట్ ఇదే!

ఏపీలో జ‌రుగుతున్న లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయింది. అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ విడుదల చేసింది. 114 అసెంబ్లీ, 5 లోక్ సభ అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించారు. కడప లోక్ సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేస్తున్నారు. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా రాంపుల్లయ్య యాదవ్, రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గిడుగు రుద్రరాజు, బాపట్ల ఎంపీ అభ్యర్థిగా ఎంపీ జేడీ శీలం, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పల్లంరాజుల పేర్లు ప్రకటించారు.

వీరిలో క‌డ‌ప‌, బాప‌ట్ల‌, కాకినాడ ఎంపీ స్థానాల‌కు అభ్య‌ర్థులుగా ఎంపికైన వారు.. బ‌ల‌మైన నాయ‌కులు కావ‌డం గ‌మ‌నార్హం. క‌డ‌ప నుంచి పోటీ చేయ‌నున్న ష‌ర్మిల వైఎస్ కుటుంబానికి చెందిన నాయ‌కురాలిగా.. పైగా వైఎస్ వార‌సురాలిగా ఇక్క‌డ బ‌ల‌మైన పోటీ ఇవ్వ‌నున్నారు. ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబం.. ఆమెకు మ‌ద్ద‌తు ఇస్తోంది. దీంతో క‌డ‌ప పార్ల‌మెంటు స్థానంలో హోరా హోరీ పోరు త‌ప్పేలా లేదు.

ఇక‌, బాప‌ట్ల నుంచి బ‌రిలోకి దిగుతున్న జేడీ శీలం కూడా.. సీనియ‌ర్ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి.. ఒక ప్పుడు బాప‌ట్ల నుంచే ఆయ‌న విజ‌యం ద‌క్కించుకున్నారు. ఎస్సీ నేత‌గా, వివాద‌ర‌హిత నాయ‌కుడిగా కూడా ఆయ‌నకు పేరుంది. అమ‌రావ‌తి రాజ‌ధానికి ఆయ‌న మ‌ద్ద‌తు తెలిపారు. ఇక‌, కాకినాడ ఎంపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగుతున్న ప‌ల్లంరాజు కూడా బ‌ల‌మైన నాయ‌కుడు. ఆర్థికంగా కూడా ఆయ‌న బ‌లంగానే ఉన్నారు. ఇక‌, సామాజిక వ‌ర్గం ప‌రంగా కూడా ఆయ‌న‌కు ఫాలోయింగ్ ఉంది. ఎలా చూసుకున్నా.. ఈ మూడు స్థానాల్లో ట‌ఫ్ ఫైట్ త‌ప్పుదు.