ఎన్ని సీట్లు తీసుకున్నామన్నది కాదు.. ఎంత స్ట్రైక్ రేట్‌తో అభ్యర్థుల్ని గెలిపించుకున్నామన్నదే ముఖ్యమని కొన్నాళ్ళ క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటికి టీడీపీ – జనసేన మధ్య సీట్ల పంపిణీపై చర్చలు ఓ కొలిక్కి రాలేదు.
60 సీట్లకు పైనే టీడీపీ నుంచి జనసేన తీసుకుంటుందనే ప్రచారం జరుగుతున్న రోజులవి. కట్ చేస్తే, జనసేనకు కూటమి నుంచి దక్కిన సీట్లు కేవలం 21 మాత్రమే. ఇవి అసెంబ్లీ సీట్లు. రెండు ఎంపీ సీట్లు కూడా జనసేనకు దక్కాయి. వాస్తవానికి తొలుత అనుకున్నది 24 అసెంబ్లీ, మూడు లోక్ సభ సీట్లు.
బీజేపీ పొత్తులోకి రావడంతో, జనసేన మూడు అసెంబ్లీ, ఓ లోక్ సభ సీటుని త్యాగం చేయాల్సి వచ్చింది. సరే, అది పంపకాల క్రమంలో జరిగే సర్దుబాట్ల వ్యవహారం. అది వేరే చర్చ. ఇంతకీ, ఈ స్ట్రైక్ రేట్ వ్యవహారమేంటి.? అభ్యర్థుల ఎంపికలో, జనసేనాని వ్యూహాలు ఎలా వున్నాయి.?
ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకే ఎక్కువగా జనసేనాని సీట్లు కేటాయించారు. సందీప్ పంచకర్లకు సీటు దక్కలేదు.. పోతిన మహేష్ కూడా టిక్కెట్ దక్కించుకోలేకపోయారు. చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదే. చివరి నిమిషం వరకూ వల్లభనేని బాలశౌరి టిక్కెట్ కోసం ఎదురుచూడాల్సి వచ్చింది.
చివరి నిమిషంలో పార్టీలో చేరుతున్న నేతలకు, పిలిచి జనసేనాని టిక్కెట్లు ఇస్తుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. అయితే, ఇదంతా స్ట్రైక్ రేట్ కోణంలో చేస్తున్న వ్యూహాత్మ రాజకీయమని జనసేన పార్టీ నుంచి అందుతున్న అత్యంత విశ్వసనీయ సమాచారం.
ముందైతే, ఓటు బ్యాంకుని చూపించుకోవాలి.. అంటే, ఓట్ల శాతం. జనసేన పార్టీకి శాశ్వత ఎన్నికల గుర్తింపుకి ఇది అత్యంత కీలకం. ఓట్ల శాతం, సీట్లు.. ఇవన్నీ జనసేనాని ‘స్ట్రైక్ రేట్’ ఆలోచనలకు తగ్గట్టుగా వుంటే, ఎన్నికల తర్వాత జనసేన పార్టీ అత్యంత వేగంగా బలం పుంజుకోనుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.
ఇదే విషయాన్ని టిక్కెట్ ఆశించి భంగపడ్డ నేతలతో జనసేనాని పవన్ కళ్యాణ్ చెబుతూ వస్తున్నారట.
Gulte Telugu Telugu Political and Movie News Updates