ఆ ఏడు నియోజ‌క‌వ‌ర్గాల‌పై.. `ష‌ర్మిల` ఎఫెక్ట్‌!

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. ప్ర‌స్తుత పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో క‌డ‌ప నుంచి పోటీ చేయ‌డం ఖాయ‌మైంది. దీనికి ఇక అధికారిక ప్ర‌క‌ట‌నే త‌రువాయి. దీంతో తొలిసారి క‌డ‌ప‌లో రెండు వైఎస్ కుటుంబాలే పోటీ చేసు కుంటున్న ప‌రిస్థితి నెల‌కొంది. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు వైఎస్ కుటుంబం అంటే.. క‌డ‌పకు కంచుకోట. అలాంటి కుటుంబంలో ఎప్పుడూ రెండు ప‌క్షాలు తెర‌మీదికి వ‌చ్చింది లేదు. కానీ, తొలిసారి వైఎస్ కుటుం బ చ‌రిత్ర‌లో క‌డ‌ప సీటు హాట్ హాట్‌గానే కాదు.. స‌ల‌స‌ల మ‌రిగే ప‌రిస్థితి నెల‌కొంది.

ప్ర‌స్తుతం క‌డ‌ప పార్ల‌మెంటు ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు. ఈయ‌న వ‌రుస‌కు ష‌ర్మిల‌కు త‌మ్ము డు అవుతాడు. వీరంతా ఒకే వంశ వృక్షానికి చెందిన వారు. పైగా వైఎస్ కుటుంబానికి చెందిన వారే. ఈ నేప‌థ్యంలో ష‌ర్మిల పోటీ ఇక్క‌డ ఆస‌క్తిగా మారింది. క‌డ‌ప నుంచి ఆమె గెలుపు గుర్రం ఎక్కుతారా?  లేదా? అనేది కీల‌క ప‌రిణామంగా కూడా మారింది. వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య వెనుక అవినాష్ రెడ్డి ఉన్నాడ‌నే ది సీబీఐ కూడా చెబుతున్న మాట‌.

దీనిని ఇక్క‌డివారు ఎంత వ‌ర‌కు న‌మ్ముతున్నారనేది ఎన్నిక‌ల్లో తేలిపోతుంది. ఒక‌వేళ అవినాష్‌రెడ్డి గెలు పుగుర్రం ఎక్కితే.. వివేకా హ‌త్య ప‌రిణామాల‌పైనా ప్ర‌భావం ప‌డుతుంది. ఇదిలావుంటే.. ష‌ర్మిల పోటీతో కీల‌క‌మైన ఏడు నియోజ‌క‌వ‌ర్గాల‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌నేది కూడా వాస్త‌వం. క‌డ‌ప పార్ల‌మెంటు ప‌రిధిలో బ‌ద్వేల్‌, క‌డ‌ప‌, పులివెందుల‌, క‌మ‌లాపురం, జ‌మ్మ‌ల‌మ‌డుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి.

ఈ నియోజ‌క‌వ‌ర్గాల‌న్నీ కూడా వైసీపీకే కాదు.. ఈ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి బ‌రిలో నిలిచిన ఆ పార్టీ నాయ‌కు లకు కూడా శ‌త్రుదుర్భేద్యాలు. పైగా క‌మ‌లాపురం వంటి నియోజ‌క‌వ‌ర్గంలో ష‌ర్మిల సొంత మేన‌మామ ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి(విజ‌య‌మ్మ త‌మ్ముడు) పోటీలో ఉన్నారు. ఇలాంటి క‌డ‌ప పార్ల‌మెంటు స్థానంలో వైఎస్ షర్మిల‌ను ఇక్క‌డి ప్ర‌జలు న‌మ్మినా.. ఆమె విష‌యంలో సానుబూతి చూపించినా.. ఈ ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ చిత్తుగా ఓడిపోతుంది. ఇందులో డౌట్‌లేదు.

కానీ, న‌మ్మ‌క పోతే.. రెండు ర‌కాలుగా వైసీపీకి లాభం. వివేకా హ‌త్య వెనుక వైసీపీ నాయ‌కులు ఉన్నార‌న్న వాద‌న‌ను ప్ర‌జ‌లు అంగీక‌రించ‌లేద‌నే బ‌ల‌మైన సంక‌తాలు ఇవ్వ‌డంతో పాటు.. వైఎస్ ష‌ర్మిల రాజ‌కీయ భ‌విత‌వ్యానికి కూడా పెద్ద గండి ఏర్ప‌డేలా చేస్తుంది. అంతేకాదు.. ష‌ర్మిల తొలిసారి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నందున ఆమెకు మ‌రింత ఇబ్బందిగా కూడా మారుతుంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.