గెలుపెరుగ‌ని వీరుడు.. 239వ సారి నామినేష‌న్‌!!

ఒక్క‌సారి ఓడిపోతేనే.. నాయ‌కులు నీరసించి పోతారు. మ‌రోసారి పోటీ చేయాలంటేనే బ‌య‌ప‌డిపోతారు. అలాంటిది.. ఒక‌సారి కాదు.. రెండు సార్లు కాదు.. త‌న జీవితంలో ఇప్ప‌టి వ‌ర‌కు 238 సార్లు నామినేష‌న్లు వేశారు. అది చిన్నా చితకా.. పెద్ద‌.. అనే తేడా లేదు. ఏ ఎన్నికైనా.. ఆయ‌న పేరు మార్మోగాల్సిందే. నామినే ష‌న్ ప‌డాల్సిందే. గెలుస్తానా. లేదా? అనే విష‌యంతో ఎలాంటి సంబంధం లేదు. నామినేష‌న్ వేశామా? లేదా? అనే ఒక్క విష‌యాన్నే ఆయ‌న చూసుకుంటారు. తాజాగా పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌లో 239వ సారి ఆయ‌న నామినేష‌న్ వేశారు.

ఆయ‌నే గెలుపు అన్న‌ది చ‌విచూడ‌ని నాయ‌కుడు, తమిళనాడులోని సేలంకు చెందిన కె. పద్మరాజన్. ఈయ‌న‌ వయసు 65 ఏళ్లు. టైరు రిపేర్ షాపు నడుపుతున్నారు. అయితే.. ఏ ఎన్నిక వ‌చ్చినా.. ఎలక్షన్ కింగ్‌గా ప్రాచుర్యం పొందిన ఆయన ఇప్పటివరకూ 238 సార్లు ఎన్నికల్లో పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల నుంచి అధ్యక్ష ఎన్నికల వరకూ ఆయన బరిలో లేని ఎన్నికే లేదు. అలాగ‌ని గెలుపు గుర్రం ఎక్కింది కూడా లేదు.

జీవితమంతా ఓటములు ఎదుర్కొంటున్నా పద్మరాజన్ మాత్రం ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఉత్సాహంగా రంగంలోకి దిగుతారు. ఎన్నికల చరిత్రలో అత్యధిక సార్లు విఫలమైన వ్యక్తిగా పద్మరాజన్‌కు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఢిల్లీ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. (ఇదీ ఓ రికార్డేనా? అను కోకండి! ఏదైనా రికార్డే)

‘‘అటల్ బిహారీ వాజ్‌పేయి, పీవీ నరసింహారావు, జయలలిత, ఎమ్. కరుణానిధి, ఏకే ఆంటొనీ, వాయలార్ రవి, బీఎస్ యడియూరప్ప, ఎస్. బంగారప్ప, ఎస్ఎమ్ కృష్ణ. విజయ్ మాల్యా, సదానంద గౌడ, అన్బుమణి రామదాస వంటి ఉద్దండులతో తలపడ్డా. అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో కూడా ఆరు సార్లు పోటీ చేశా. నాకు గెలవాలని ఉండదు. ఓడిపోవాలనేదే నా కోరిక. గెలుపు తాత్కాలికం, ఓటమి శాశ్వతం’’ అని పద్మరాజన్ తనదైన ఫిలాసఫీ వల్లెవేశారు.