ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జెడ్ క్యాటగిరి భద్రత కల్పించింది. సీఆర్పీఎఫ్ బలగాలతో లోకేష్‌కు భద్రత కల్పిస్తున్నట్లు హోంశాఖ ఉత్తర్వులలో పేర్కొంది. దీంతో కీలకమైన ఎన్నికల వేళ.. స్థానిక అధికారులు.. పోలీసుల నుంచి అడుగడుగునా తనిఖీలు తప్పినట్టే అయిందని అంటున్నారు సీనియర్ నాయకులు.
అక్టోబర్ 2016 ఏఓబి ఎన్ కౌంటర్ తరువాత లోకేష్ కి జెడ్ క్యాటగిరి భద్రత కల్పించాలని నాటి ఎస్ఆర్సీ( సెక్యూరిటీ రివ్యూ కమిటీ ) ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మరోవైపు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే లోకేష్‌కు భద్రత తగ్గించింది. సెక్యూరిటీ రివ్యూ కమిటీ గతంలో చేసిన సిఫార్సులు పక్కన పెట్టిన వైసీపీ ప్రభుత్వం.. లోకేష్ కి వై క్యాటగిరి భద్రత మాత్రమే కల్పిస్తూ వస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర హోం శాఖ నారా లోకేష్‌కు ‘జడ్’ కేటగిరీ భద్రత కల్పించింది. ఆదివారం నుంచి ఆయన చుట్టూ కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పేఎఫ్)లోని వీఐపీ వింగకు చెందిన సాయుధ కమాండర్లు 33 మంది రక్షణగా నిలుస్తారు. నారా లోకేష్ ఎక్కడికి వెళ్లినా.. ఆయన వెంటే నడుస్తారు. ఆయనను వెన్నంటే ఉంటారు. నారా లోకేష్‌ను కలుసుకోవాలంటే.. రెండంచెల భద్రతను దాటి వెళ్లాల్సి ఉంటుంది.
ఎలా వచ్చింది?
- 2019కు ముందు రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారా లోకేషు జడ్ కేటగిరి భద్రత అవసరమని అప్పటి సెక్యూరిటీ రివ్యూ కమిటీ కేంద్రానికి సిఫారసు చేసింది. 2016 అక్టోబరులో జరిగిన భారీ ఎన్ కౌంటర్ తో చంద్రబాబు కుటుంబాన్ని అంతం చేస్తామని మావోలు ప్రకటనలు విడుదల చేయడం, ఎమ్మెల్యేతోపాటు మాజీ ఎమ్మెల్యేని గత ఎన్నికలకు ఆర్నెల్ల ముందు మావోయిస్టులు హత్య చేయడం లాంటి ఘటనలతో లోకేష్ కు గత ప్రభుత్వంలో పోలీసులు సెక్యూరిటీ పెంచారు.
- యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ను… వైసీపీ ప్రేరేపిత అల్లరి మూకలు కవ్వించిన వీడియోలు, బౌతిక దాడులకు దిగిన దృశ్యాలు.. ఇతరత్రా భద్రతా పరమైన ఆవశ్యకతను వివరిస్తూ లేఖ రాయడంతో కేంద్రం స్పందించింది. ఈ నేపథ్యంలోనే జడ్ కేటగిరీ భద్రతను కల్పించింది.