ఔను.. సర్దుకు పోతా.. బీజేపీని గెలిపిస్తా: ప‌రిటాల శ్రీరాం

“ఔను.. నేను ధ‌ర్మ‌వ‌రం టికెట్ ఆశించా. నాలుగున్న‌రేళ్లుగా ఇక్క‌డే ప‌డుకున్నా. ఇక్క‌డే తిన్నా. ఇక్క‌డే ప‌నిచేశా. టీడీపీ జెండాను గ్రామ గ్రామాన ఎగిరేలా చేశా. అయితే.. పొత్తులో భాగంగా నాకు టికెట్ రాలేదు. ఇది కొంత బాధ‌గానే ఉంది. అలాగ‌ని పార్టీని వీడి పోను. పార్టీ అధినేత నిర్ణ‌య‌మే శిరోధార్యం. ఇక్క‌డ బీజేపీ నేత స‌త్య కుమార్‌కు టికెట్ ఇచ్చారు. సంతోషం క‌లిగింది. ఆయ‌న‌ను గెలిపించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తా” అని ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని ధ‌ర్మవరం టికెట్ ఆశించిన ప‌రిటాల శ్రీరాం చెప్పారు.

“ఐదేళ్ల క్రితం శ్రీరామ్ వేరు.. ఇప్పుడు శ్రీరామ్ వేరు” అని వ్యాఖ్యానించారు. ధర్మవరంలో ప్రతి కార్యకర్త ధైర్యంగా అడుగు ముందుకు వేయాలని దిశానిర్దేశం చేశారు. బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు సత్యకుమార్‌ని గెలిపించాల్సిన బాధ్యత మనదేనని అన్నారు. ఇప్పటికే ధర్మవరం పేరు ఢిల్లీలో వినిపించిందని చెప్పారు. ఎన్నికల తర్వాత అది మార్మోగాలని టీడీపీకార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు. “సత్యకుమార్ వెనుక శ్రీరామ్ ఉన్నాడు. వైసీపీ నాయకులకు గట్టిగా హెచ్చరించి చెబుతున్నా. టీడీపీ- జనసేన బీజేపీ కేడర్‌కు పరిటాల శ్రీరామ్ అండ‌గా ఉంటాడు” అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

కొందరిలాగా(ప‌రోక్షంగా వ‌ర‌దాపురం సూరిని ఉద్దేశించి) ఓటమి తర్వాత కార్యకర్తలను వదిలేసే టైపు తాను కాదని పరిటాల శ్రీరామ్ విమ‌ర్శించారు. ధర్మవరంలో టీడీపీ సింబల్ మాత్రమే లేదని.. బీజేపీ ఉన్నా.. అది టీడీపీ కిందే ఉంటుంద‌ని చెప్పారు. మిగిలినదంతా ‘సేమ్ టు సేమ్’ అని చెప్పారు. టికెట్ రానంత మాత్రాన పారిపోయే వ్యక్తిని కాదన్నారు. త్యాగం మాటల్లోనే కాదని.. చేతల్లో కూడా చూపించామని, కష్టం, నష్టం వచ్చినా.. తన ప్రయాణం ధర్మవరంలోనేనని పరిటాల శ్రీరామ్ చెప్పుకొచ్చారు.

కాగా, ఈ సీటును ఆశించిన ప‌రిటాల శ్రీరాం.. త‌న‌కు ఇవ్వాల్సిందేన‌ని అన్నారు. ఒక‌వేళ పొత్తులో భాగంగా త‌న‌కు ఇవ్వ‌క‌పోతే.. వ‌ర‌దాపురం సూరికి మాత్రం ఇవ్వ‌రాద‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. మ‌రి ఈ కార‌ణ‌మో.. మ‌రే కార‌ణమో.. తెలియ‌దు కానీ.. ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన వ‌ర‌దాపురం సూరి(గోనుగుండ్ల సూర్య‌నారాయ‌ణ‌)కి టికెట్ ఇవ్వ‌లేదు.