కేంద్ర మాజీ మంత్రి, ఒకప్పటి టీడీపీ నాయకుడు, ప్రస్తుతం బీజేపీలో ఉన్న సుజనా చౌదరి తాజాగాటీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌తో భేటీ అయ్యారు. నేరుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చిన సుజనా చౌదరి.. ఇక్కడే ఉంటున్న నారా లోకేష్ నివాసానికి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోల ను సుజనా చౌదరి తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై నారా లోకేష్‌తో చర్చించినట్టు తెలిపారు. ఇక్కడి సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానన్నారు.
ప్రస్తుతం సుజనా చౌదరి ఉమ్మడి పార్టీల కూటమి అభ్యర్థిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన-టీడీపీలు సంయుక్తంగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడ వెస్ట్ సీటును బీజేపీ తీసుకుంది. ఈ పార్టీ తరఫున సూజనా చౌదరి పోటీ చేయనున్నారు. ఈయన అభ్యర్థిత్వాన్ని ఇటీవలే బీజేపీ ఖరారు చేసింది. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో నే ఉంటున్నారు. వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నారు.
రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన పదవి కాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సీటును తీసుకున్నారని ప్రచారం ఉంది. ఇదిలావుంటే.. బీజేపీ తరఫున పోటీ చేయనున్న సుజనా.. ఏపీకి వచ్చి.. బీజేపీ నేతలను కలవకుండా.. నేరుగా టీడీపీ నేతలను కలవడం ద్వారా.. వివాదాలకు ఆజ్యం పోసినట్టు అయిందనే టాక్ వినిపిస్తోంది. ఇక్కడ టీడీపీ నుంచి ఇద్దరు కీలక నాయకులు పోటీ పడినా.. వారిని పక్కన పెట్టి మరీ.. బీజేపీకి కేటాయించారు.
బీజేపీ టికెట్‌పై ఉమ్మడి అభ్యర్థిగా సుజనా పోటీ చేస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో ఆయన బీజేపీ నేతలకు ప్రాధాన్యంఇచ్చి ఉంటే బాగుండేదని .. తద్వారా.. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా చేసి ఉండేవారని చెబుతున్నారు. ఏదేమైనా.. సుజనా నారా లోకేష్ కంటే ముందు.. నియోజకవర్గంలో పర్యటించి ఉన్నా.. ఆ సంకతాలు వేరేగా ఉండేవని చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates