ప్రస్తుతం ‘మేం సైతం సిద్ధం’ పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తున్న సీఎం, వైసీపీ అధినేత జగన్.. చేస్తున్న వ్యాఖ్యల్లో తేడాలు కనిపిస్తున్నాయి. వీటిని నెటిజన్లు, ప్రతిపక్ష నాయకులు కూడా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పర్యటించిన జగన్.. ఇక్కడి వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకను ఆయన ప్రజలకు పరిచయం చేశారు. వాస్తవానికి కర్నూలు ప్రజలకు బుట్టా రేణుకను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఆమె కర్నూలు ఎంపీగా 2014-19 వరకు పనిచేశారు.
ఇక, ఇప్పుడు కూడా కర్నూలు ఎంపీ అడిగినా.. ఆమెను ఎమ్మిగనూరు స్థానాన్ని ప్రకటించారు. ఇక్కడ నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. ఎమ్మిగనూరు సభలో ఆమెను పరిచయం చేసిన సీఎం జగన్.. ఆమె గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుట్టా రేణుక దగ్గర పెద్దగా డబ్బు లేదు. ఆమె కూడా అంతంత మాత్రమే
అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే.. ఇప్పుడు ఎదురు దాడి చేస్తున్నాయి. వాస్తవానికి బుట్టా రేణుక.. ఆర్థికంగా స్థితిమంతురాలు. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక పార్టీకి 100 కోట్లు విరాళం ఇచ్చారనే వార్తలు వచ్చాయి.
అలాంటి నాయకురాలిని పట్టుకుని అంతంతే
అని వ్యాఖ్యానించడాన్ని తప్పుబడుతున్నారు. అంతే కాదు.. ఈ సందర్భంగా బుట్టా రేణుక ఆస్తులపైనా చర్చ జరుగుతోంది. ఆమె భర్త విద్యావ్యాపారంలో తల మునకలుగా ఉన్నారు.
- హైదరాబాద్ లో ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటిగా పేరొందిన స్కూలు.. నగరంలోనే పలు బ్రాంచీలు, హోండా టూ వీలర్ డీలర్ షిప్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ వ్యాపారాలు ఉన్నాయి.
- వందల కోట్ల విలువైన ఆస్తులు, వ్యాపారాలు ఉన్నట్టు ఆమె తన అఫిడవిట్‌లో 2014లోనే వెల్లడించారు.
- గతంలో బుట్టా రేణుక దంపతులు పాల్గొన్న ఓ టీవీ ఇంటర్వ్యూలో స్వయంగా బుట్టా రేణుక తన వ్యాపార సంస్థల గురించి చెప్పడం గమనార్హం.
- హైదరాబాద్ లో మెరిడియన్ విద్యా సంస్థలతో పాటు టూవీలర్ డీలర్ షిప్ ప్రతుల్ హోండా కూడా తమదేనని పేర్కొన్నారు. ఇంకా ఆటోమొబైల్ పరిశ్రమలు మరికొన్ని ఉన్నాయని వివరించింది.