రేవంత్ ను కలిసిన నందమూరి వారసురాలు

నంద‌మూరి కుటుంబం నుంచి రాజ‌కీయ అరంగేట్రం చేసిన రెండో మ‌హిళ‌.. నంద‌మూరి సుహాసిని. తొలి మ‌హిళ‌, ప్ర‌స్తుతం బీజేపీ ఏపీ అధ్య‌క్షురాలిగా ఉన్న పురందేశ్వ‌రి. అయితే.. సుహాసిని తాజాగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఆమె నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని క‌లుసుకున్నారు. రేవం త్ నివాసానికి వెళ్లిన నంద‌మూరి సుహాసిని పుష్పగుచ్ఛం అందించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛా ర్జీ దీపాదాస్ మున్షీ, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సమక్షంలో ఆమె రేవంత్ ను కలిశారు.

అయితే.. ప్ర‌స్తుత లోక్ సభ ఎన్నికల సమయంలో రేవంత్ ను నంద‌మూరి సుహాసిని కలవడం ఆసక్తి కరం గా మారింది. పైగా.. ఇలా క‌లుస్తున్న వారంతా నాలుగు రోజుల్లోనో.. వారం రోజుల్లోనో పార్టీలు మారుతున్న విష‌యం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు నంద‌మూరి సుహాసిని విష‌యం కూడా ఇంతేన‌ని రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నారు. ఆమె కూడా త్వ‌ర‌లోనే.. పార్టీ తీర్థం పుచ్చుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం నంద‌మూరి సుహాసిని తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.

ఎవ‌రీ సుహాసిని?

మాజీ మంత్రి, అన్న‌గారు ఎన్టీఆర్ కుమారుడు నంద‌మూరి హ‌రికృష్ణ పెద్ద కుమార్తె సుహాసిని. ఫ్యాష‌న్ డిజైన‌ర్‌గా వృత్తిని ప్రారంభించిన ఆమె.. తొలినాళ్ల‌లో సినిమాల‌కు కూడా పనిచేశారు. త‌ర్వాత‌.. కుటుంబా నికే ప‌రిమిత‌మ‌య్యారు. 2018 ఎన్నికల్లో తొలిసారి టీడీపీ కండువా క‌ప్పుకొన్న సుహాసిని.. మహాకూటమిలో భాగంగా టీడీపీ తరపున కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆమె త‌ర‌ఫున అప్ప‌ట్లో నంద‌మూరి బాల‌కృష్ణ కూడా ప్ర‌చారం చేశారు. కానీ, ఆమె ఘోరంగా ఓడిపోయారు. ఇక, ప్ర‌స్తుత ఏపీ ఎన్నిక‌ల్లో అసెంబ్లీ టికెట్ కోసం ప్ర‌య‌త్నించినా.. అది ద‌క్క‌లేదు. ఇక‌, ఇప్పుడు ఆమె కాంగ్రెస్‌లోకి ప‌య‌నించ‌నున్నారు. ఇదే జ‌రిగితే.. ఇక‌, తెలంగాణ టీడీపీకి ఆమె రాజీనామా చేయ‌క‌త‌ప్ప‌దు.