ఏపీలో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం.. ఎలాంటి అవకతవకలు రాకుండా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో సంఘం ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమిం చింది. సాధారణ ఎన్నికల అబ్జర్వర్ గా రామ్ మోహన్ మిశ్రా, స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ గా రిటైర్డ్ ఐపీఎస్ దీపక్ మిశ్రా, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి నీనా నిగమ్ ను ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రామ్మోహన్ మిశ్రా 1987వ బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి కాగా.. దీపక్ మిశ్రా 1984 బ్యాచ్, నీనా నిగమ్ 1983 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారులు. ఈ ముగ్గురు అధికారులు వచ్చే వారం ఏపీలో పర్యటించ నున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ఏర్పాట్లను వీరు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ మార్గదర్శకాలను పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు చేపట్టనున్నారు.
రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలతో పాటు ఓటర్లను ఆకర్షించే గిఫ్ట్స్, తాయిలాల ని యంత్రణపై వీరు ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. ఎపీలో ఎక్కడెక్కడ పొరపాట్లు జరుగుతున్నాయనే అంశా లపై వీరు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించనున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాజకీయ పార్టీలకు చెందిన నేతల వ్యవహారశైలి, ప్రచారం వంటి అంశాలపై ఈసీ ప్రత్యేక దృష్టి సారించింది.
ఇప్పటికే రాజకీయ పార్టీల ప్రచారానికి సంబంధించి అనేక నిబంధనలు విధించిన ఎన్నికల కమిషన్.. తాజాగా ఇంటింటి ప్రచారానికి సంబంధించి కొన్ని షరతులను విధించింది. ఈ మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సచివాలయంలోని ఈసీ కార్యాలయంలో సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఇటీవల సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిబంధనలు, ప్రచార అనుమతులకు సంబంధించి కీలక సూచనలు చేశారు.