అనంతపురం జిల్లాలోనే కాకుండా, రాయలసీమ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో టీడీపీ ముఖ్యనేతల లిస్టు తయారుచేస్తే పయ్యావుల కేశవ్ టాప్ -20 లో ఉంటారు. రాజకీయ అవగాహన, అనుభవం ఉన్నా… ఆయన మీడియాలో అరుదుగా కనిపిస్తున్నారు. పార్టీలో చాలా సీనియరే అయినా ప్రస్తుతం పదవిలో ఉన్నా కూడా ఎంచేతో పార్టీ కార్యక్రమాలతో పాటు అధినేతకు కూడా దూరం మెయిన్ టైన్ చేస్తున్నారు.
మొన్నటి ఎన్నికల్లో వైసిపి ప్రభంజనాన్ని తట్టుకుని రాయలసీమ మొత్తం మీద గెలిచిన ముగ్గురు ఎంఎల్ఏల్లో పయ్యావుల కూడా ఒకరు. చిత్తూరు జిల్లాలోని కుప్పంలో చంద్రబాబునాయుడు, అనంతపురం జిల్లాలో పయ్యావులతో పాటు హిందుపురం నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ మాత్రమే గెలిచారు. దురదృష్టం ఏమిటంటే కేశవ్ ఓడినపుడు పార్టీ అధికారంలోకి వస్తుందని కేశవ్ గెలిచాడంటే మాత్రం పార్టీ ఓడిపోయినట్లే అనే సెంటిమెంటు పార్టీలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా బలపడిపోయింది.
నిజానికి మొదటినుండి కూడా పార్టీకి స్ట్రాంగ్ సపోర్టరుగా నిలుస్తున్నాడు. వ్యవసాయం, ఇరిగేషన్ రంగాల్లో మంచి పట్టున్న నేతగానే చెప్పాలి. పార్టీతో పాటు అధినేత చంద్రబాబునాయుడుకు కూడా వీర విధేయుడనటంలో సందేహం అవసరం లేదు. అలాంటిది 2014-19 మధ్య పయ్యావులను చంద్రబాబు దూరం పెట్టేశాడు. కానీ కొంతకాలం తర్వాత తప్పనిస్ధితిలో పయ్యావులను శాసనమండలి సభ్యునిగా నియమించారు చంద్రబాబు.
జిల్లాలో మొదటినుండి పయ్యావుల-పరిటాల కుటుంబాలకు పెద్దగా సఖ్యత లేదు. అయితే 2014లో రాప్తాడు నుండి పరిటాల సునీత గెలవటంతో జిల్లాలో ఆమెదే మొత్తం హవా నడిచింది. ఇందులో భాగంగానే పయ్యావులకు ఎలివేషన్ రానీకుండా సునీతే అడ్డుపడిందనే ప్రచారం కూడా ఉంది. అయితే తర్వాతెపుడో పయ్యావులకు ఎంఎల్సీగా అవకాశం వచ్చినా పెద్దగా గుర్తింపయితే రాలేదనే చెప్పాలి. దాంతో ఈయన కూడా ఎందుకో అధినేతకు దూరంగానే ఉండిపోయాడు.
అధికారంలో ఉన్నంత కాలం అలాగే జరిగినా మొత్తానికి 2019 ఎన్నికల్లో పయ్యావుల గెలిచారు. పార్టీ ఓడిపోవటంతో పాటు రాప్తాడులో సునీతకు బదులుగా పోటి చేసిన కొడుకు పరిటాల శ్రీరామ్ కూడా ఓడిపోయాడు. దాంతో పయ్యావుల సెంటిమెంటుపై జనాల్లో మళ్ళీ చర్చ మొదలైంది. సరే ఈ చర్చ ఇలా ఉండగానే తనకు అసెంబ్లీలో శాసనసభాపక్ష ఉపనేతగా అవకాశం వస్తుందని పయ్యావుల చాలా ఆశగా ఎదురుచూశాడని చెబుతారు. కానీ ఎందుకనో మళ్ళీ చంద్రబాబు ఈయన్ను దూరంగా పెట్టేశారు. కానీ తర్వాత పరిణామాల్లో పయ్యావులకే పార్టీ తరపున దక్కే పిఏసి ఛైర్మన్ పదవిని చంద్రబాబు కట్టబెట్టారు. అయినా కానీ ఈయన ఎందుకనో ఉత్సాహంగా కనిపించటం లేదు.
23 సీట్లతో పార్టీ ఘోరంగా ఓడిపోయి కష్టాల్లో పడిపోయింది. ఇటువంటి సమయంలో పయ్యావుల లాంటి నేతలు పార్టీ గొంతును బలంగా వినిపిస్తారని చాలామంది అనుకున్నారు. అందరినీ ఆశ్చర్యపరుస్తు ఈయన మాత్రం అసలు గొంతే వినిపించటం మానేశారు. పార్టీ తరపున దక్కిన పదవిని తీసుకున్న పయ్యావుల పార్టీ గొంతును మాత్రం ఎందుకు వినిపించటం లేదనదే సస్పెన్సుగా మిగిలిపోయింది. ఒకవైపు అధికారపార్టీ తరపున మంత్రులు, ఎంఎల్ఏలు చంద్రబాబుతో పాటు పార్టీని అసెంబ్లీలో దులిపేస్తున్నారు. చంద్రబాబు నోరెత్తటం ఆలస్యమన్నట్లుగా అధికారపార్టీ సభ్యులు ఏకధాటిగా మాటలతో దాడులు చేస్తున్నారు. అయితే ఇదే సభలో సభ్యుడిగా ఉన్న పయ్యావుల మాత్రం అధినేతకు మద్దతుగా మాట్లాడింది దాదాపు లేదనే చెప్పాలి.
ఇందుకు మూడు కారణాలు పార్టీలో ప్రచారంలో ఉంది. మొదటిదేమో అమరావతి ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ నేతల్లో పయ్యావుల పేరు కూడా ఉంది. చాలామంది తాము అమరావతిలో భూములు కొన్నది లేనిది ఇంతవరకు చెప్పలేదు. కానీ పయ్యావుల మాత్రం తాను భూములు కొన్నది వాస్తవమేనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఈ విషయంలో చంద్రబాబు-పయ్యావుల మధ్య వివాదం మొదలైందట.
ఇక రెండో కారణం ఏమిటంటే అధికారంలో ఉన్నపుడు తనను చంద్రబాబు దూరంగా పెట్టేశారనే మంట బాగా ఉందట. కాబట్టే ఇపుడు తాను మవునంగా ఉంటున్నాడట. ఇక మూడో కారణం ఏమిటంటే పయ్యావుల వైసిపిలో చేరిపోతున్నట్లు బలంగా ప్రచారం జరుగుతోంది. ఎప్పుడేమవుతుందో చెప్పలేని స్ధితిలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తాను ఉద్యమించి చేసేదేమీ లేదనే అభిప్రాయంతోనే పయ్యావుల వీలైనంతలో సైలెంటుగా ఉంటున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. మరి ఏది నిజమో కాలమే తేల్చిచెప్పాలి.